తాడేపల్లి: రాష్ట్రంలో దళితులపై దాడులు అంతకంతకూ పెరిగిపోతున్నాయని, తాజాగా వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శృంగారపాటి సందీప్ ను తుళ్లూరు పోలీసులు అరెస్టు చేసిన విధానమే ఇందుకు నిదర్శమని పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ నేతలు మండిపడ్డారు. నిన్న పోలీసులు గుంటూరు జిల్లా కాజా టోల్ ప్లాజా వద్ద అరెస్టు చేసిన తర్వాత ఇవాళ బెయిల్ లభించడంతో తాడేపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన శృంగారపాటి సందీప్.. ఎస్సీ సెల్ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై హైకోర్టును ఆశ్రయించబోతున్నట్లు శృంగారపాటి సందీప్ ప్రకటించారు. దళితులపై ఇష్టారాజ్యంగా దాడులకు దిగుతున్న కూటమి సర్కార్ కు వారే సమాధి కడతారని పార్టీ రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ హెచ్చరించారు. శృంగారపాటి సందీప్, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దాదాపు నెల రోజుల నుంచీ మందడం డీఎస్పీ మురళీకృష్ణ, తుళ్లూరు పోలీసులు నా కుటుంబాన్ని తీవ్రంగా వేధిస్తున్నారు. ఓ దళిత నాయకుడైన నన్ను, వైయస్ఆర్‌సీపీ పార్టీ నాయకుడైనప్పటికీ మానసికంగా ఎంతో వేధిస్తున్నారు. ఓ డ్రెస్సులు ఉండవు, నోటీసులు ఇవ్వరు. ఏదైనా కేసు ఉంటే చెప్పమని చెప్పినా వినకుండా, నోటీసు కూడా ఇవ్వకుండా కిడ్నాప్ చేసి తీసుకెళ్లి హింసించారు. కూటమి ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేకపోవడం సిగ్గుచేటు. నెల రోజులుగా ప్రసార మాధ్యమాల్లో పోలీసుల వేధింపుల్ని బయటపెడుతున్నా వారి దుశ్చర్యలు ఆగడం లేదు. నా సొంత పని మీద గుంటూరు వెళ్తుంటే, మంగళగిరి టోల్ గేట్ దగ్గర మూడు వాహనాల్లో వచ్చి నా కారును రౌండప్ చేశారు. మఫ్టీలో వచ్చి నన్ను పట్టుకుని పిడిగుద్దులు గుద్దారు. నా ఫోన్ పగులగొట్టడమే కాకుండా కారులో పడేసి ఈడ్చుకుంటూ వెళ్లారు. నన్ను అరెస్టు చేసిన సమాచారం కుటుంబ సభ్యులకు కూడా ఇవ్వలేదు. ఎవరో చెప్తే వాళ్లు పోలీసు స్టేషన్ కు వచ్చారు. దుప్పటి అడిగినా కూడా ఇవ్వకుండా బూతులు తిడుతూ మా అమ్మా,నాన్నా వచ్చినా కలవనీయలేదు. నువ్వు అమరావతి గురించి మాట్లాడటానికి వీల్లేదంటున్నారు. అమరావతి గురించి మాట్లాడను కానీ అక్కడ జరుగుతున్న అవినీతి గురించి మాట్లాడతానని చెప్తున్నా వినకుండా దాడులు చేస్తున్నారు. నాకు నల్లగుడ్డతో ముసుగు వేసి క్రిమినల్ గా ముద్ర వేస్తున్నారు. నాపై సోషల్ మీడియా కేసులుంటే ఏదో హత్యలు చేసిన వాడిలా, పోక్సో కేసు నిందితుడిని చూసినట్లు చూస్తున్నారు. కొత్తగా నా మీద ఏ కేసు కూడా లేదు. పాత కేసులు మాత్రమే ఉన్నాయి. వాటినే సెక్షన్లు మార్చి హింసించేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసులు పెట్టి మిమ్మల్ని వేధించాలని చూస్తే, మా స్వేచ్ఛను హరించాలని చూస్తే మా కార్యకలాపాలు రెండింతలు పెరుగుతాయి తప్ప తగ్గే అవకాశం లేదు. ఈ వేధింపులపై హైకోర్టును ఆశ్రయిస్తాను. కాకుమాను రాజశేఖర్, పార్టీ రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడు సందీప్ ను అరెస్టు చేశాక ఆయన్ను కలిసి మాట్లాడేందుకు కూడా అనుమతి ఇవ్వని పరిస్ధితులు కల్పించారు. లీగల్ టీమ్ ను కూడా ఆయన్ను కలవనీయలేదు. ఆయన్ను అరెస్టు చేసిన కేసులో ఇతరులకు బెయిల్ రావడంతో, సెక్షన్లు మార్చి మరీ బెయిల్ రాకుండా ప్రయత్నించారు. కానీ ఇవన్నీ అక్రమ సెక్షన్లని నిర్ధారించి కోర్టు బెయిల్ ఇచ్చింది. దళితుల పట్ల కూటమి ప్రభుత్వ వ్యవహరశైలికి ఇదే నిదర్శనం. విజయవాడలో క్రాంతి కుమార్ ఘటన అందరూ చూశారు. సీఐ నాగరాజు వేధింపుల కారణంగా క్రాంతీ కుమార్ ఆత్మహత్య చేసుకుంటే కేసు పెట్టడానికి 15 రోజులు తీసుకున్నారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హోంమంత్రి మేకప్ వేసుకున్నారని చెప్పగానే వెంటనే కేసులు పెట్టారు. టీడీపీ నాయకుడైన పేరు పోగు వెంకటేశ్వరరావు కుమారుడైన క్రాంతి కుమార్ చనిపోతే, వారి కుటుంబాన్ని ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి, వైయస్ఆర్‌సీపీ నాయకులు తప్ప అధికార పార్టీ నుంచి ఎవరూ పరామర్శించలేదు. ఇది దళిత వ్యతిరేక కూటమి. దళితులే కూటమి ప్రభుత్వానికి సమాధి కడతారు.