పులివెందుల ప్రజాదర్బార్‌లో వినతులు స్వీకరణ

సంక్షేమ పథకాలు అందడం లేదని వైయస్ జగన్‌కు ప్రజల ఫిర్యాదు

ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై పోరాటం చేస్తాం: వైయస్ జగన్

వైయ‌స్ఆర్ జిల్లా: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మంగళవారం పులివెందుల చేరుకున్నారు. పులివెందుల హెలిప్యాడ్‌కు చేరుకున్న అనంతరం ఆయన భాకరాపురంలోని తన క్యాంప్ కార్యాలయానికి బయలుదేరారు.

దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి  జయంతి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శ్రీ వైయస్ జగన్ రెండు రోజుల పాటు పులివెందులలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా నేడు క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.

ప్రజాదర్బార్‌కు పెద్ద ఎత్తున ప్రజలు, యువత, పార్టీ శ్రేణులు తరలివచ్చారు. వైయస్ జగన్ ను కలిసేందుకు యువత బారులు తీరింది. తమ సమస్యలను నేరుగా ఆయనకు వివరించి వినతిపత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా పలువురు ప్రజలు కూటమి ప్రభుత్వ పాలనలో పేదలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని వైయస్ జగన్ కు ఫిర్యాదు చేశారు. సంక్షేమ పథకాలు సక్రమంగా అందడం లేదని, కొత్త పింఛన్లు మంజూరు కావడం లేదని, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలు నిలిచిపోయాయని ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజల సమస్యలను ఓపికగా విన్న వైయస్ జగన్, వారికి ధైర్యం చెప్పారు. పేదలు, విద్యార్థులు, వృద్ధులు, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాల్సిందేనని అన్నారు. ప్రజా సమస్యలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. మన ప్రభుత్వం తిరిగి రాగానే అందరికీ న్యాయం జరుగుతుందని ప్రజలకు భరోసా ఇచ్చారు.

వైయస్ జగన్‌ను కలిసిన ఉపాధ్యాయ సంఘాల నేతలు

ప్రజాదర్బార్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య — ఫ్యాప్టో, వైయస్సార్ కడప జిల్లా ప్రతినిధులు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ను కలిశారు. ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, విద్యాహక్కు చట్టంలో అవసరమైన సవరణలు చేయించేందుకు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.

సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నిర్వహించడం సరికాదని ఉపాధ్యాయ సంఘాల నేతలు వైయస్ జగన్ కు వివరించారు. బీఈడీ పూర్తి చేసి ఉద్యోగం పొందిన తర్వాత 25 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న ఉపాధ్యాయులను మళ్లీ టెట్ రాయాలని చెప్పడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.

ఉపాధ్యాయుల సమస్యను శ్రద్ధగా విన్న వైయస్ జగన్ , ఈ అంశంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కేంద్రంతో మాట్లాడతారని హామీ ఇచ్చారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను వైఎస్సార్‌సీపీ ఎంపీలు కలిసి సమస్యను వివరిస్తారని తెలిపారు.

రేపు ఇడుపులపాయకు వైయస్ జగన్

రేపు మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా శ్రీ వైయస్ జగన్  ఇడుపులపాయకు వెళ్లనున్నారు. వైయస్సార్ ఘాట్ వద్ద జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని మహానేతకు నివాళులు అర్పించనున్నారు.

Back to Top