ఆక్వా రైతుల సమస్యలపై పోరాటానికి సిద్ధమైన వైయస్ జగన్

 జూలై 15న భీమవరంలో జరిగే ఆక్వా రైతు సదస్సు పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ‌

తాడేపల్లిగూడెం: ఆక్వా రైతుల సమస్యల పరిష్కారం కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టనున్న భీమవరం పర్యటనను విజయవంతం చేయాలని వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు పిలుపునిచ్చారు. జూలై 15న భీమవరంలో నిర్వహించనున్న ఆక్వా రైతు సదస్సుకు సంబంధించిన పోస్ట‌ర్ల‌ను ఆవిష్క‌రించారు. ఈ స‌ద‌స్సుకు భారీగా తరలివచ్చి రైతుల పక్షాన సంఘీభావం ప్రకటించాలని నేత‌లు కోరారు.

తాడేపల్లిగూడెంలోని గమిని ఫంక్షన్ హాల్లో వైయ‌స్ఆర్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వడ్డీ రఘురామ్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో రీజినల్ కోఆర్డినేటర్ గుడివాడ అమర్‌నాథ్, జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, గూడూరి ఉమాబాల, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, సీడ్, ఫీడ్, ప్రాసెసింగ్ కంపెనీలు కలిసి ఫీడ్ ధరలను పెంచి, రొయ్యల ధరలను తగ్గించడం వల్ల ఆక్వా రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రైతులు పలుమార్లు ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వం స్పందించకుండా వ్యాపార సంస్థలకే మద్దతుగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

కరెంటు సబ్సిడీ తొలగింపు, ఫీడ్ ధరల పెంపు, ఎగుమతుల సమస్యల పరిష్కారంలో వైఫల్యం కారణంగా ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం రైతులను నిరాశపరిచిందని ఆరోపించారు. ఆక్వా రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వారి తరఫున పోరాటం చేయడానికే వైయస్ జగన్ భీమవరం వస్తున్నారని పేర్కొంటూ, జూలై 15న జరిగే ఆక్వా రైతు సదస్సును విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Back to Top