అనంతపురం: వైయస్ఆర్‌సీపీ నేత, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆయన నివాసం ఉన్న ఇంటి యజమాని కక్కలపల్లి శ్రీనివాస్ ఖండించారు. గత ఏడేళ్లుగా అద్దె చెల్లించలేదంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేస్తూ, క్రమం తప్పకుండా అద్దె చెల్లిస్తున్నారని తెలిపారు. అనంతపురంలోని శ్రీనగర్ కాలనీలోని తన ఇంటిలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కుటుంబం అద్దెకు ఉంటోందని శ్రీనివాస్ తెలిపారు. వాస్తవానికి ఆ ఇంటిని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తండ్రి ఆత్మారామిరెడ్డికి అద్దెకు ఇచ్చానని, అప్పటి నుంచి ఎలాంటి బకాయిలు లేకుండా నిర్ణీత సమయానికి అద్దె చెల్లిస్తున్నారని వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యేపై కొందరు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్న శ్రీనివాస్, అలాంటి తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదని, నిజానిజాలు ప్రజలు గుర్తించాలని కోరారు.