తాడేపల్లి: మెగా డీఎస్సీ-2025లో జరిగిన అక్రమాలపై, ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా నియామకాల్లో జరిగిన అవకతకలపై తక్షణం సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 21న వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో విజయవాడ శాప్ కార్యాలయం ముందు నిరసన చేపట్టనున్నట్టు మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రకటించారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాశ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. స్పోర్ట్స్ కోటాలో తప్పుడు సర్టిఫికెట్లతో అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారని వైయస్ఆర్‌సీపీ మొదటి నుంచీ ప్రశ్నిస్తోందన్నారు. అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగాలు దక్కకుండా అన్యాయం చేసి, అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారని విమర్శించారు. చివరకు ప్రభుత్వ శాఖల్లోనే కొన్ని స్పోర్ట్స్ సర్టిఫికెట్లు తప్పుడువని తేలుతున్న పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఉద్యోగం పొందిన అభ్యర్థులు సైతం తమకు ఉద్యోగం ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదని చెప్పే పరిస్థితి వచ్చిందంటే.. ఈ నియామక ప్రక్రియ ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చన్నారు. అక్రమ నియామకాలను చూస్తూ వైయస్ఆర్‌సీపీ ఊరుకోదని, నిరుద్యోగులకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం స్పందించే వరకు వైయస్ఆర్‌సీపీ పోరాటం కొనసాగిస్తుందని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు? నియామక ప్రక్రియలో రోజుకొక అక్రమం బయటకు వస్తోన్నా, అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు న్యాయవిచారణ జరపడం లేదని అంబటి రాంబాబు ప్రశ్నించారు. వైయస్ఆర్‌సీపీ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అధికారుల చేత మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. డీఎస్సీ నియామకాలు పారదర్శకంగా జరిగాయని తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్ చెబుతున్నారని, తప్పు జరగలేదని భావించినప్పుడు న్యాయవిచారణ జరిపించి నిజాలను ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. ఏమీ తప్పు జరగలేదని భావిస్తున్నప్పుడు సీబీఐ విచారణకు ఎందుకు వెనుకాడుతున్నారో సమాధానం చెప్పాలన్నారు. నిరుద్యోగులకు అన్యాయం జరిగితే వైయస్ఆర్‌సీపీ చూస్తూ ఊరుకోదు: అర్హత ఉన్నవారికి ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి.. తమకు కావాల్సిన వారికి ఉద్యోగాలు ఇచ్చుకునే కార్యక్రమం జరిగిందని ఆరోపించారు. అహర్నిశలు కష్టపడి చదువుకుని, ఉద్యోగం వస్తుందనే ఆశతో పరీక్షలకు హాజరైన నిరుద్యోగులకు ఈ విధంగా అన్యాయం చేయడం దారుణమని అంబటి రాంబాబు అన్నారు. డీఎస్సీ గురించి ప్రశ్నిస్తే ఏపీపీఎస్సీలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం ఆరోపిస్తోందని.. అలాంటప్పుడు రెండింటిపైనా సీబీఐ విచారణ చేయించాలని వైయస్ఆర్‌సీపీ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోందన్నారు. ఆరోపణలు చేయడం కాదు.. దమ్ముంటే సీబీఐ విచారణకు సిద్ధపడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్యాయానికి గురైన అర్హులైన అభ్యర్థులకు తిరిగి ఉద్యోగాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు వైయస్ఆర్‌సీపీ పోరాటం కొనసాగిస్తుందని అంబటి రాంబాబు హెచ్చరించారు.