డీఎస్సీ అవకతవకలపై 21న శాప్‌ కార్యాలయం ఎదుట ఆందోళన

 మాజీ మంత్రి అంబటి రాంబాబు

తాడేపల్లి: డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్న అవకతవకలపై న్యాయవిచారణ జరిపి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఈ నెల 21వ తేదీ ఉదయం 10 గంటలకు విజయవాడలోని శాప్‌ కార్యాలయం ఎదుట వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయ‌స్ఆర్‌సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌తో కలిసి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.

డీఎస్సీ ద్వారా 16 వేలకు పైగా పోస్టులు భర్తీ చేశామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, రోజుకొక అక్రమం వెలుగులోకి వస్తోందని అంబటి రాంబాబు పేర్కొన్నారు. పేపర్‌ లీకేజీలు, ప్రశ్నపత్రాల అమ్మకాలు, డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారనే ఆరోపణలతో పాటు స్పోర్ట్స్‌ కోటాలో జరిగిన అవకతవకలు కూడా వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. స్పోర్ట్స్‌ కోటాను 2 శాతం నుంచి 3 శాతానికి పెంచి, తప్పుడు స్పోర్ట్స్‌ సర్టిఫికెట్ల ఆధారంగా పోస్టులు భర్తీ చేశారనే ఆరోపణలు వస్తున్నాయని చెప్పారు. అర్హత ఉన్న అభ్యర్థులకు ఉద్యోగాలు దక్కకుండా, అనర్హులకు తప్పుడు ధ్రువపత్రాల ఆధారంగా ఉద్యోగాలు కల్పించినట్లు ఆధారాలతో సహా వెల్లడించామని తెలిపారు.

ప్రభుత్వ శాఖలే కొన్ని స్పోర్ట్స్‌ సర్టిఫికెట్లు తప్పుడువని చెబుతున్న పరిస్థితి ఉన్నప్పటికీ, ప్రభుత్వం న్యాయవిచారణకు ఎందుకు ఆదేశించడం లేదని అంబటి రాంబాబు ప్రశ్నించారు. డీఎస్సీతో పాటు ఏపీపీఎస్సీలోనూ అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రెండింటిపైనా సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు.

అహర్నిశలు కష్టపడి చదివిన నిరుద్యోగులకు అన్యాయం జరిగితే వైయ‌స్ఆర్‌సీపీ చూస్తూ ఊరుకోదని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే న్యాయవిచారణ జరిపి, అర్హులైన అభ్యర్థులకు జరిగిన అన్యాయంపై క్షమాపణ చెప్పడంతో పాటు వారికి తిరిగి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం సమాధానం చెప్పే వరకు, అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం కొనసాగిస్తుందని అంబటి రాంబాబు తెలిపారు. 

Back to Top