ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే విశాఖలో నీటి సంక్షోభం

నీటి ఎద్ద‌డి ఉంద‌ని తెలిసినా ముందుస్తు ప్ర‌ణాళిక‌లు లేవు
 
రిజ‌ర్వాయ‌ర్లు సిద్ధం చేయ‌క‌పోవ‌డం వ‌ల్లే ముదిరిన స‌మ‌స్య‌

 కె.కె. రాజు ఆగ్ర‌హం

విశాఖలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు

 చంద్ర‌బాబుకి వాట‌ర్ మ్యాన్ క‌న్నా.. క్వార్ట‌ర్ మ్యాన్ పేరు స‌రిగ్గా సూట‌వుతుంది

 పోలవరం నీళ్ల పేరుతో చంద్రబాబు పబ్లిసిటీ తప్ప.. విశాఖకు ఒరిగిందేమిటి?

 ప్రజలు బిందె నీటి కోసం అల్లాడుతుంటే.. నీటి మాఫియా దోపిడీ

 జీవీఎంసీ ఉచిత మంచినీటి ట్యాంకర్ల దోపిడీపై విచార‌ణ జ‌ర‌పాలి

 నాలుగు రోజుల్లో సమస్య పరిష్కరించాలి.. లేదంటే జీవీఎంసీ కమిషనరేట్ ముట్టడి

  ప్ర‌భుత్వానికి కె.కె. రాజు హెచ్చ‌రిక

విశాఖ‌ప‌ట్నం: విశాఖ న‌గ‌రంలో ఏర్పడిన తీవ్ర తాగునీటి సంక్షోభానికి కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు కె.కె. రాజు ఆరోపించారు. విశాఖ‌లోని జిల్లా పార్టీ కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులు, నీటి ఎద్దడి ప్రమాదం ఉందని తెలిసినా ముడసర్లోవ, తాటిపూడి, రైవాడ, గంభీరం, మేఘాద్రిగడ్డ రిజర్వాయర్లలో పూడికతీత, నీటి నిల్వల కోసం ప్రభుత్వం ఎలాంటి ముందస్తు ప్రణాళికలు చేపట్టలేదని విమర్శించారు. ప్రజలకు తాగునీరు అందించాల్సిన ప్రభుత్వం సమస్యను పట్టించుకోకపోవడంతో నగర ప్రజలు బిందె నీటి కోసం పాకులాడే దుస్థితి వచ్చిందన్నారు. ఒకవైపు ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతుంటే మరోవైపు ట్యాంకర్ నీళ్లను రూ.3 వేల నుంచి రూ. 5 వేల‌కు విక్రయించి జేబులు నింపుకుంటున్నార‌ని ఆరోపించారు. పోలవరం, గోదావరి నీళ్ల పేరుతో భారీగా ప్రచారం చేస్తున్న ప్రభుత్వం ముందుగా విశాఖ ప్రజల దాహార్తిని తీర్చాలని డిమాండ్ చేశారు. నాలుగు రోజుల్లో నీటి సంక్షోభాన్ని పరిష్కరించకపోతే వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి జీవీఎంసీ కమిషనరేట్‌ను ముట్టడిస్తామని కె.కె. రాజు హెచ్చరించారు. చంద్రబాబు వాటర్ మ్యాన్ కాద‌ని, ఆయనకు క్వార్టర్ మ్యాన్ అనే పేరు సూట్ అవుతుంద‌ని చెప్పారు.

ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే...

విశాఖ ప్రజలు తాగునీటికి అల్లాడుతున్నారు
ఈరోజు విశాఖ నగర ప్రజలు తాగునీటికి కటకటలాడుతున్నారు. గుక్కెడు మంచి నీటి కోసం ప్రజలు అల్లాడుతున్న పరిస్థితి వచ్చింది.
కొన్ని ప్రాంతాల్లో మూడు రోజులకు ఒకసారి నీటి సరఫరా జరుగుతోంది. ఎప్పుడు నీళ్లు వస్తాయో తెలియక ప్రజలు పనులు మానుకుని ట్యాపుల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి వచ్చింది. బిందె నీటి కోసం ప్రజలు పాకులాడుతున్నారు. నీటి కోసం కొట్లాట జరిగి పీఎం పాలెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన పరిస్థితి వచ్చింది. ఇది విశాఖ నగరానికి ఎప్పుడూ లేని దౌర్భాగ్య పరిస్థితి. ఇప్పుడే విశాఖలో నీటి సంక్షోభం ఈ స్థాయిలో ఉంటే భవిష్యత్తులో పరిస్థితి ఎలా ఉంటుందో ప్రభుత్వం ఆలోచించాలి. విశాఖను అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేస్తామని చెబుతున్నప్పుడు అందుకు తగ్గట్టుగా నీటి వనరులపై దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి. రిజర్వాయర్ల సామర్థ్యం పెంచాలి. నీటి నిల్వలను పరిరక్షించాలి. ప్రత్యామ్నాయ నీటి వనరులను సిద్ధం చేయాలి. ప్రజలకు భద్రమైన తాగునీరు అందించడం ప్రభుత్వ మొదటి బాధ్యత.

రిజర్వాయర్లపై ముందస్తు ప్రణాళిక ఏది?
ఇది ప్రకృతి వైపరీత్యం మాత్రమే కాదు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తీవ్రత పెరిగిన నీటి సంక్షోభం. వ‌ర్షాభావ పరిస్థితులు, నీటి ఎద్దడి వచ్చే ప్రమాదం గురించి హెచ్చరికలు ఉన్నాయి. అయినా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకుండా ఇప్పుడు ప్రజలు నీటి కోసం అల్లాడే ప‌రిస్థితి తీసుకొచ్చారు. విశాఖ నగరానికి తాగునీటిని అందించే ముడసర్లోవ, తాటిపూడి, రైవాడ, గంభీరం, మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ల గురించి ప్రభుత్వానికి తెలియదా? వర్షాకాలం పూర్తయిన తర్వాత నీటి నిల్వలను పెంచుకోవడానికి పూడికతీత ఎందుకు చేపట్టలేదు? ముందస్తు ప్రణాళిక ఎందుకు రూపొందించలేదు?  విశాఖ ప్రజల తాగునీటి కష్టాల గురించి ఎల్లో మీడియానే కథనాలు రాస్తోంది. నగరంలో నీటి సరఫరా గాడి తప్పిందని, ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని, కొన్నిచోట్ల నీటి కోసం గొడవలు జరుగుతున్నాయని ఆ పత్రికలే చెబుతున్నాయి. అయినా కూటమి ప్రభుత్వం మాత్రం ప్రజల సమస్యను పరిష్కరించకుండా ప్రచార ఆర్భాటాల్లో మునిగిపోయింది.

పోలవరం నీళ్లపై చంద్రబాబుకు సూటి ప్రశ్న

చంద్రబాబు విశాఖను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామని చెబుతున్నారు. ప్రపంచానికే తలమానికంగా చేస్తామని చెబుతున్నారు. మరి ముందుగా ఈ నగర ప్రజలకు తాగడానికి నీళ్లు ఇవ్వాలి కదా? పోలవరం నీళ్లు విశాఖకు తీసుకొస్తామని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. గోదావరి నీళ్లు వస్తున్నాయని చెప్పారు. ఆయ‌న‌ చెప్పిన పోలవరం నీటిలో నుంచి విశాఖ నగర ప్రజలకు ఒక్క నీటి బొట్టు అయినా వచ్చి ఉంటే చూపించండి. పోలవరం పేరుతో పేపర్లు, టీవీల్లో ప్రచారానికి ఖర్చు చేస్తున్న డబ్బును ప్రజల తాగునీటి కోసం ఖర్చు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ప్రజలకు కావాల్సింది పబ్లిసిటీ కాదు.. గుక్కెడు మంచి నీళ్లు.

పరిశ్రమలు, డేటా సెంటర్లకు నీరు.. ప్రజలకు ఎందుకు లేదు?

ప్రజల తాగునీటి అవసరాల కోసం ఉన్న నీటి నిల్వలను కొన్ని పరిశ్రమలకు తరలిస్తున్నారనే ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
ప్రజల దాహార్తిని పట్టించుకోకుండా పరిశ్రమలకు నీటి సరఫరాకు ప్రాధాన్యత ఇస్తున్నారా లేదా స్పష్టం చేయాలి. భారీగా నీటి అవసరం ఉండే డేటా సెంటర్ల విషయంలో కూడా ప్రజల్లో ఆందోళన ఉంది. ప్రజల కష్టాలను అవకాశంగా తీసుకుని నీటి మాఫియా దోపిడీకి పాల్పడుతోంది. ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, భూ మాఫియా, గనుల మాఫియా, నిత్యావసర సరుకుల మాఫియా తర్వాత ఇప్పుడు నీటి మాఫియా కూడా తయారైంది. సిటీలోని కొన్ని కాలనీల్లో ఒక ట్యాంకర్ నీటిని రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు అమ్ముతున్న పరిస్థితి ఉంది. ప్రజలు నీటి కోసం అల్లాడుతుంటే వారి అవసరాన్ని ఆసరాగా చేసుకుని నీటిని వ్యాపారంగా మార్చడం దారుణం.

మధురవాడ, పోతినమల్లయ్యపాలెం, అక్కయ్యపాలెంలో దుస్థితి

మధురవాడ పోతినమల్లయ్యపాలెం ఆర్‌హెచ్‌ కాలనీలో వేలాది కుటుంబాలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నాయి. వేలాది గడపలకు అవసరమైన నీటి సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కయ్యపాలెంలో ప్రజలు బురదనీటితో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అపార్టుమెంట్ వాసులు కూడా తాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇవి క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులు. వాస్త‌వంగా ప‌రిస్థితులు ఇంత దారుణంగా ఉంటే, జీవీఎంసీ ఉచిత మంచినీటి సరఫరా పేరుతో ప్రజలకు నీరు అందించాల్సిన ట్యాంకర్ల విషయంలో కూడా దోపిడీ జరుగుతోంది. ఉచిత మంచినీటి సరఫరా అని రాసి ఉన్న జీవీఎంసీ ట్యాంకర్లే ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితులున్నాయి. ఈ వ్యవహారంపై ప్రభుత్వం, జీవీఎంసీ అధికారులు వెంటనే విచారణ జరిపి నిజానిజాలు బయటపెట్టాలి.

చంద్ర‌బాబు, వాటర్ మ్యాన్ కాదు.. క్వార్టర్ మ్యాన్

చంద్రబాబు త‌న‌ని తాను వాట‌ర్ మ్యాన్ అని ప్ర‌చారం చేసుకుంటున్నాడు. కానీ ఆయనకు సూటబుల్ నేమ్ వాటర్ మ్యాన్ కాదు.. క్వార్టర్ మ్యాన్. ఎందుకంటే జనాలు తాగునీటి కష్టాలతో అల్లాడుతుంటే ఆయన మాత్రం వీధివీధికి బార్లు, వైన్ షాపులు, బెల్ట్ షాపులు తెరవడంపై శ్రద్ధ చూపిస్తున్నారు. ప్రజలకు తాగడానికి నీళ్లు లేవు. కానీ ప్రభుత్వం మాత్రం మద్యం దుకాణాల విషయంలో మాత్రం దూకుడుగా వ్యవహరిస్తోంది.

ప్ర‌భుత్వానికి నాలుగు రోజులే గడువు

ఒక రూపాయికి కూరగాయలు రావడం లేదు. కానీ 99 పైసలకు విశాఖ భూములు విచ్చ‌ల‌విడిగా పంచేస్తున్నారు. మున్సిపల్ ట్యాంకర్ దగ్గర నీటి కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముందు ప్రజల ప్రాథమిక సమస్యలను పరిష్కరించండి. విశాఖ నగరంలో ఏర్పడిన నీటి సంక్షోభాన్ని నాలుగు రోజుల్లో పరిష్కరించాలి. ప్రతి కాలనీకి అవసరమైన స్థాయిలో తాగునీరు అందించాలి. నీటి మాఫియాను అరికట్టాలి. జీవీఎంసీ ఉచిత మంచినీటి సరఫరాను నిజంగా ఉచితంగా ప్రజలకు అందించాలి. ప్రజలు నీటి కోసం పనులు మానుకుని పడిగాపులు కాసే పరిస్థితిని వెంటనే నివారించాలి. నాలుగు రోజుల్లో సమస్యను పరిష్కరించకపోతే వైయ‌స్ఆర్‌సీపీ ప్రజల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమిస్తుంది. సోమవారం వేలాది మంది ప్రజలతో జీవీఎంసీ కమిషనరేట్‌ను ముట్టడిస్తాం. ప్రజల దాహార్తిని తీర్చే వరకు పోరాటం కొనసాగిస్తాం. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా ముద్దు నిద్ర వీడి వాస్తవ పరిస్థితిని గుర్తించాలని కె.కె. రాజు హిత‌వు ప‌లికారు.
 

Back to Top