2029లో వైయ‌స్‌ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవడమే లక్ష్యం

 మడకశిర విస్తృత స్థాయి సమావేశంలో వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త ఎస్‌.ఎల్‌. ఈరలక్కప్ప

మడకశిర : మడకశిర పట్టణంలోని ఏవీఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తల ఐడీ కార్డుల పంపిణీకి సంబంధించిన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. మడకశిర నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త ఎస్‌.ఎల్‌. ఈరలక్కప్ప ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు, వార్డు అధ్యక్షులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎస్‌.ఎల్‌. ఈరలక్కప్ప మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యువత, విద్యార్థులు, రైతులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను ప్రతిపక్షంగా ప్రశ్నించడం తమ బాధ్యత అని, సమస్యలను ఎత్తిచూపుతున్న నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు.

 స్థానిక ఎన్నికలకు ఇప్పటి నుంచే కార్యాచరణ

స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని ఈరలక్కప్ప పిలుపునిచ్చారు. ప్రతి వార్డులో మంచి అభ్యర్థులను ఎంపిక చేసి వారి విజయానికి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. పార్టీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ చేపట్టనున్నట్లు తెలిపారు.

కూటమి ప్రభుత్వానికి భయపడకుండా కార్యకర్తలంతా ఐక్యంగా పనిచేయాలని, ప్రతి వార్డులో పార్టీ అభ్యర్థుల విజయానికి అవసరమైన సహాయ సహకారాలను పార్టీ తరఫున అందిస్తామని భరోసా ఇచ్చారు. 2029లో వైయ‌స్‌ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవడమే తమ లక్ష్యమని, వైయ‌స్ఆర్‌సీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

ఈ సమావేశంలో మడకశిర నియోజకవర్గ పరిశీలకులు రఘునాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వై.టి. ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర ఎస్‌ఈసీ మెంబర్ గోవర్ధన్ రెడ్డి, రాష్ట్ర వక్కలిగ అధ్యక్షుడు రంగే గౌడ్, సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి, మాజీ జెడ్పీటీసీ జి.బి. శివకుమార్, రాష్ట్ర ఆర్టీఐ కార్యదర్శి సత్యనారాయణ, రాష్ట్ర మహిళా నాయకురాలు భారతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

 

Back to Top