అనంతపురం: ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ వంటి హామీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న యువతను లక్ష్యంగా చేసుకుని నిఘా వ్యవస్థను నడుపుతున్నారనే ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయని వైయస్ఆర్‌సీపీ బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రతి పౌరుడి హక్కు అని, ఆ హక్కును వినియోగించుకుంటున్న విద్యార్థులు, నిరుద్యోగులను నేరస్తులుగా చూడటం సరికాదని తెలిపారు. మంగళవారం అనంతపురంలో మీడియాతో మాట్లాడిన రమేష్ గౌడ్.. ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి కోసం యువత ప్రశ్నిస్తే వారికి సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం, వారి కార్యకలాపాలపై నిఘా పెట్టడం ఆందోళనకరమన్నారు. స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్, సైబర్ విభాగాల పేరుతో నిరుద్యోగ యువతకు సంబంధించిన వాట్సాప్ గ్రూపులు, గ్రూప్ అడ్మిన్ల వివరాలు, సోషల్ మీడియా కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారనే సమాచారం తమ దృష్టికి వచ్చిందన్నారు. యువత డిజిటల్ కార్యకలాపాలపై నిఘా? ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్న డిజిటల్ గొంతులను నియంత్రించేందుకే ఇటువంటి చర్యలు జరుగుతున్నాయనే అనుమానాలు కలుగుతున్నాయని రమేష్ గౌడ్ తెలిపారు. ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులతో పాటు వారికి మార్గనిర్దేశం చేసే కోచింగ్ సెంటర్లు, అధ్యాపకులు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై కూడా ఒత్తిడి తీసుకువస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. ఫైర్ సేఫ్టీ, లైసెన్సుల తనిఖీల పేరుతో కోచింగ్ సంస్థలను ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. పోలీసు వ్యవస్థను దేనికి ఉపయోగించాలి? శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ కోసం పనిచేయాల్సిన పోలీసు వ్యవస్థను ప్రభుత్వాన్ని ప్రశ్నించే యువతను పర్యవేక్షించేందుకు ఉపయోగిస్తే అది ఆందోళనకరమైన పరిణామమని రమేష్ గౌడ్ పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించే ప్రతి వ్యక్తిని ప్రత్యర్థిగా చూడటం, ప్రశ్నించే ప్రతి యువకుడిని అనుమానాస్పద వ్యక్తిగా చూడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో భాగమని తెలిపారు. హామీలు ఎక్కడ.. సమాధానాలు ఎక్కడ? ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన ఉద్యోగ హామీలు, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని రమేష్ గౌడ్ కోరారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది యువతకు భరోసా కల్పించాల్సిన సమయంలో వారి ఫోన్లు, సోషల్ మీడియా కార్యకలాపాలు, నిరసనలపై దృష్టి పెట్టడం సమస్యకు పరిష్కారం కాదన్నారు. ప్రజల సమస్యలను వినడం, ఇచ్చిన హామీలను అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.