అల్లూరి సీతారామరాజు జిల్లా : డుంబ్రిగుడ మండలం సొవ్వ గ్రామ పంచాయతీ పరిధిలో పలు గ్రామాలకు చేపట్టిన రోడ్డు పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చమండపాడు, బరియపాడు, కమలబంధ, సాగిరివలస, కిరిడివలస, చిన్నకంగువలస, అమలాగూడ, మలింగవలస గ్రామాలకు వెళ్లే రోడ్లు అధ్వానంగా మారడంతో వైయస్ఆర్‌సీపీ యువ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా అరకు నియోజకవర్గ నాయకుడు పాంగి నరసింగరావు ఆధ్వర్యంలో యువ నాయకుల బృందం సొవ్వ పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో పర్యటించి రోడ్ల పరిస్థితిని పరిశీలించింది. రోడ్లు పూర్తిగా దెబ్బతిని బురదమయంగా మారడంతో విద్యార్థులు, గర్భిణీలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పాంగి నరసింగరావు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో 108 వాహనాలు సైతం గ్రామాల్లోకి చేరుకోలేని దుస్థితి నెలకొందన్నారు. గిరిజన రైతులు పండించిన పంటలను సంతలకు తరలించేందుకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రోడ్డు సౌకర్యం సరిగా లేక పంటలను మోసుకెళ్లాల్సి రావడంతో రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైన రోడ్డు పనులను ప్రస్తుత కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే పనులు మధ్యలో నిలిచిపోయాయని పేర్కొన్నారు. అధికారులు వెంటనే స్పందించి నిలిచిపోయిన రోడ్డు పనులను పునఃప్రారంభించి పూర్తిచేయాలని కోరారు. ఈ పర్యటనలో వైయస్ఆర్‌సీపీ యువ నాయకులు, సొవ్వ పంచాయతీ బూత్ ఇన్‌చార్జి కినుబుడి రఘునాథ్, వైయస్ఆర్‌సీపీ బూత్ ఏజెంట్ పాంగి కురంజాన్‌తో పాటు స్థానిక గ్రామస్తులు పాల్గొన్నారు.