ఇచ్చిన హామీల అమల్లో పూర్తిగా విఫలమైన వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం

హామీలపై ప్రశ్నించే గొంతులపై ఉక్కుపాదం మోపుతున్న కూటమి సర్కార్:

ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడ్డ  జక్కంపూడి రాజా.

రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా.

నిరుద్యోగ జెన్‌జీ యువతపై ప్రభుత్వ అక్రమ నిఘా

డిజిటల్ ప్రొఫైలింగ్ ఆపకపోతే తిరుగుబాటు తప్పదు:

ప్రభుత్వాన్ని హెచ్చిరించిన మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా.

రాజమండ్రి:  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపుతూ, ప్రశ్నించే సీనియర్ జర్నలిస్టులపై రాజద్రోహం కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తోందని ఆయన ఆరోపించారు. జాబ్ క్యాలెండర్, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ ఎక్కడని నిలదీస్తున్న నిరుద్యోగ యువతపై కక్ష సాధింపు చర్యలకు దిగుతూ, కోచింగ్ సెంటర్లపై దాడులు చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ మోసాలను ఎండగడుతున్న జెన్‌జీ యువత, ఇన్‌ఫ్లుయెన్సర్లపై ఇంటెలిజెన్స్, సైబర్ క్రైమ్ విభాగాలతో డిజిటల్ ప్రొఫైలింగ్ పేరుతో అక్రమ నిఘా పెడుతున్న కూటమి పాలకుల నియంతృత్వ పోకడలపై ఆయన నిప్పులు చెరిగారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే...

గాడి తప్పిన పాలన - ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు.

రాష్ట్రంలో కూటమి పాలన మొదలైన రెండున్నర సంవత్సరాలుగా శాంతిభద్రతలు పూర్తిగా గాలికి ఎగిరిపోయాయి. పరిపాలనా వ్యవస్థను భ్రష్టు పట్టించి పోలీస్ యంత్రాంగాన్ని చేతుల్లో పెట్టుకుని నియంతలా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రశ్నించిన వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలపై వందల కొద్దీ తప్పుడు కేసులు బనాయించి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. చివరకు సీనియర్ జర్నలిస్టులపైనా రాజద్రోహం కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేసే నీచ సంస్కృతిని తెచ్చారు. ఇప్పుడు వీరి మోసపూరిత మాటలు నమ్మి ఓట్లేసిన నిరుద్యోగ యువత, జెన్‌జీ వంతు వచ్చింది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చాలు అక్రమ కేసులు పెట్టి జైళ్లలో వేయడమే వీరి ఏకైక ఎజెండాగా మారింది.

జెన్‌జీ యువత, కోచింగ్ సెంటర్లపై అక్రమ నిఘా..

ప్రభుత్వ వైఫల్యాలపై స్వచ్ఛందంగా గళమెత్తుతున్న యువతను అణచివేయడానికి డిజిటల్ నెట్‌వర్క్ మ్యాపింగ్, ప్రొఫైలింగ్ చేస్తున్నారు. యువత ఏయే వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నారు, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో ఏం పోస్టులు పెడుతున్నారు, యూట్యూబర్ల వివరాలు ఏంటనే దానిపై నిఘా పెట్టడం అధికార దుర్వినియోగం కాదా? నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చే కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు, ఫ్యాకల్టీ వివరాలు సేకరిస్తూ, నిబంధనల పేరుతో వారిని బెదిరింపులకు గురిచేస్తున్నారు. ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్, సైబర్ క్రైమ్ విభాగాలను నేరాల నియంత్రణకు వాడకుండా ప్రశ్నించే వారిపై నిఘా పెట్టడానికి వాడుకోవడం సిగ్గుచేటు.

శాంతిభద్రతల వైఫల్యం - ఉద్యోగాల హామీల ఎగవేత.

మహిళలు, విద్యార్థులు, చిన్నారులపై నిత్యం అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా వాటిని నియంత్రించే స్వేచ్ఛ పోలీసులకు ఇవ్వట్లేదు. కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని అణగదొక్కడానికి డీజీపీ స్థాయి నుంచి హోంగార్డు వరకు మొత్తం పోలీస్ వ్యవస్థను వాడుకుంటున్నారు. తిరుపతిలో న్యాయమైన స్టైఫండ్ అడిగిన మహిళా పారామెడికల్ విద్యార్థినులను జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి బూటుకాళ్లతో తన్నిస్తారా? ఉద్యోగాలు ఇవ్వడం మీవల్ల కాకపోతే ప్రజల ముందుకు వచ్చి ఎన్నికల్లో అబద్ధాలు చెప్పి మోసం చేశామని క్షమాపణ చెప్పండి. అంతేగానీ ప్రశ్నించే గొంతులపై నిర్బంధం ప్రయోగిస్తే చూస్తూ ఊరుకోం.

చరిత్ర పునరావృతమైతే పాలకులకు పతనం తప్పదు.

ప్రజల వ్యక్తిగత సంభాషణలు విని, వారి స్వేచ్ఛను కాలరాసిన ఈస్ట్ జర్మనీ ప్రభుత్వం కట్టిన బెర్లిన్ గోడ ఎలా బద్దలైందో చంద్రబాబు గుర్తుంచుకోవాలి. యువత ఖాతాలను బ్లాక్ చేసి మూడు దశాబ్దాలు పాలించిన ఈజిప్ట్ నియంత ముబారక్‌ను అక్కడి యువతే కూలదోసింది. శ్రీలంకలో గొటబాయ రాజపక్సేను, బంగ్లాదేశ్‌లో షేక్ హసీనాను యువత ఆగ్రహమే గద్దె దించింది. గుజరాత్, బీహార్ విద్యార్థి ఉద్యమాలు ప్రభుత్వాలనే కూల్చివేశాయి. ఏపీ డీఎస్సీలో అక్రమాలు జరిగాయని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెబితే ఆయనపై పీడీ యాక్ట్ పెట్టే ధైర్యం మీకుందా? సామాన్య విద్యార్థుల గొంతు నొక్కడం తగదు.

కాగ్ నివేదికతో బట్టబయలైన కూటమి దివాలా..

ఈ నేపధ్యంలో రాజ్యాంగాన్ని కాలరాస్తూ పోలీసులను అడ్డం పెట్టుకుని చేసే అరాచకాలు భవిష్యత్తులో మీ మెడకే చుట్టుకుంటాయని జక్కంపూడి రాజా హెచ్చరించారు.  వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో లక్షలాది శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేసామన్నారు.  కానీ నేడు కాగ్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఏడాదిలో కేవలం ఎనిమిది రోజులు మాత్రమే ఖజానా ఆదాయంతో ప్రభుత్వం నడుస్తోందని... మిగిలిన అన్ని రోజులూ ఓవర్ డ్రాఫ్ట్‌లు, అప్పుల మీదే బండి లాగుతున్న దుస్ధితికి తీసుకొచ్చారని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లు రూ.3000 నిరుద్యోగ భృతి, వార్షిక జాబ్ క్యాలెండర్ హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.  ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు త్వరలోనే  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మళ్లీ పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వస్తారని స్పష్టం చేశారు.
 

Back to Top