తాడేపల్లి: రాష్ట్రంలో అర్నబ్ తుపాను సృష్టిస్తున్న బీభత్సాన్ని చూసి ప్రజలు అతలాకుతలం అవుతుంటే, బాధ్యతగా అండగా ఉండాల్సిన చంద్రబాబు ప్రభుత్వం మాత్రం సహాయక చర్యలను విస్మరించి కేవలం పబ్లిసిటీ కార్యక్రమాలపైనే పూర్తిగా దృష్టి పెట్టిందనివైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వెన్నుపోటు పార్టీ అరాచకాలు పెరిగిపోయి, ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న తరుణంలో వాటిని డైవర్ట్ చేసేందుకే చంద్రబాబు ఈ పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో బుడమేరు వరదలు, విశాఖలో హుద్ హుద్ తుపాను సమయాల్లోనూ ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే, బాబు అండ్ కో మాత్రం క్రేన్లు ఎక్కి ఫోటోలకు ఫోజులివ్వడం, పబ్లిసిటీ కార్యక్రమాలు చేసుకోవడానికే పరిమితమయ్యారని గుర్తుచేశారు. లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిని, వందలాది గ్రామాలకు కరెంట్, రవాణా సౌకర్యాలు నిలిచిపోతే... మంత్రులు, నేతలు క్షేత్రస్థాయికి వెళ్లకుండా ఏకంగా సీసీ కెమెరాలలో తుపాను నష్టాన్ని చూస్తున్నామని చెప్పడం మహా విడ్డూరమని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 28 నెలల కాలంలో ఏకంగా 17 తుపానులు, వాయుగుండాలు వస్తే... నష్టపోయిన ఒక్క రైతన్నకైనా పరిహారం అందించిన పాపాన పోలేదని దుయ్యబట్టారు. అర్నబ్ తుపాను వల్ల భారీ వర్షాలు పడుతూ ఉంటే, ముందే కేవలం 70 వేల ఎకరాల్లోనే పంట నష్టం జరిగిందంటూ తప్పుడు లెక్కలు చెప్పి మరోసారి రైతులను మోసం చేయడానికి సిద్ధమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లిసిటీ కార్యక్రమాలకు తక్షణమే ఫుల్ స్టాప్ పెట్టాలని, తుపాను బాధితులకు తక్షణమే నగదు సహాయంతో పాటు నిత్యవసర సరుకులు అందించాలని డిమాండ్ చేశారు. అలాగే గత మోందా తుపాను పరిహారంతో పాటు, ప్రస్తుత అర్నబ్ తుపాను పంట నష్టాన్ని కూడా వెంటనే అంచనా వేసి ఇన్పుట్ సబ్సిడీ చెల్లించాలని.. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వైఎస్సార్‌సీపీ చూస్తూ ఊరుకోదని కారుమూరు వెంకటరెడ్డి హెచ్చరించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... తుపాను హెచ్చరికలు ఉన్నా..: తుపాను సమయంలో ప్రజలకు అండగా నిలవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం ప్రచార ఆర్భాటానికే ప్రాధాన్యం ఇస్తోంది. తుపాను వస్తుందని ముందే తెలిసినా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అధికారులను అప్రమత్తం చేయడం, బాధితులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంపై ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? తుపానును అడ్డుకున్నామని, ప్రకృతి వైపరీత్యాలను నియంత్రించినట్లు గొప్పలు చెప్పుకోవడం కాదు.. ప్రజలను ఎంతమందిని ఆదుకున్నారో చెప్పాలి. సీసీ కెమెరాల్లో తుపాను నష్టాన్ని చూస్తున్నామని ప్రచారం చేయడం విడ్డూరంగా ఉంది. రైతుల పొలాల్లోకి వెళ్లి పంట నష్టాన్ని పరిశీలించాలి, బాధిత కుటుంబాలను పరామర్శించాలి. ప్రచారానికి పెట్టే సమయాన్ని సహాయక చర్యలకు కేటాయించాలి. క్షేత్ర స్థాయిలో పంట నష్టం అంచనా వేయాలి: గత తుపాన్లలో నష్టపోయిన రైతులకే పరిహారం అందించని ప్రభుత్వం ఇప్పుడు మరోసారి రైతులను మోసం చేయకూడదు. మోంథా తుపాను సమయంలో జరిగిన పంట నష్టానికి సంబంధించిన పరిహారం, ఇన్‌పుట్ సబ్సిడీ బకాయిలను తక్షణమే చెల్లించాలి. ప్రస్తుత తుపానులో పంట నష్టం ఎంత జరిగిందో క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించకుండా ముందుగానే పరిమిత లెక్కలు ప్రకటించడం సరికాదు. లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వాస్తవ నష్టాన్ని గుర్తించి రైతులకు న్యాయం చేయాలి. ఉచిత పంటల బీమా, ఈ-క్రాప్ విషయంలో రైతులకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలి. గత తుపాన్ల పరిహారంతో పాటు ప్రస్తుత తుపాను నష్టపరిహారాన్ని కూడా అర్హులైన రైతులందరికీ అందించాలి. లోకేష్ ట్వీట్లతో రైతులకు మేలు జరగదు: తుపాను బాధితులకు తక్షణమే నగదు సాయం, నిత్యావసర సరుకులు, తాగునీరు, నాణ్యమైన ఆహారం, సురక్షిత వసతి కల్పించాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేస్తోంది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి ప్రాణనష్టం జరగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలి. విద్యుత్, రవాణా సౌకర్యాలు నిలిచిపోయిన ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టాలి. విజయవాడ బుడమేరు వరదల సమయంలో బాధితుల కోసం వచ్చిన విరాళాలు, వాటి ఖర్చుల వివరాలను కూడా ప్రభుత్వం పారదర్శకంగా వెల్లడించాలి. చంద్రబాబు ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం కాకుండా బాధితుల కష్టాలను గుర్తించి తక్షణ సహాయం అందించాలి. నారా లోకేష్ ట్వీట్లు, ప్రకటనలతో నాయకత్వాన్ని నిరూపించుకోవడం కాదు.. తుపాను బాధితులకు క్షేత్రస్థాయిలో ఎంత సహాయం అందించారో చెప్పాలి. నారా లోకేష్ ట్వీట్లు, ప్రకటనలతో నాయకత్వాన్ని నిరూపించుకోవడం కాదు.. తుపాను బాధితులకు క్షేత్రస్థాయిలో ఎంత సహాయం అందించారో చెప్పాలి. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రచారానికి పరిమితం కాకుండా, బాధితులకు అండగా నిలిచి ప్రభుత్వం తక్షణ సహాయక చర్యలు చేపట్టేలా బాధ్యత తీసుకోవాలని కారుమూరు వెంకటరెడ్డి హితవు పలికారు.