నెల్లూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ శ్రేణులు ఐక్యంగా పనిచేసి విజయాన్ని సాధించాలని మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని శ్రీ కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వైయస్ఆర్‌సీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు గుర్తింపు కార్డులను అందజేశారు. చంద్రబాబుకు కౌంట్‌డౌన్ ప్రారంభమైందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని ఖచ్చితంగా ఢీకొంటామని కాకాణి స్పష్టం చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థానిక ఎన్నికల్లో పోరాటానికి పిలుపునిచ్చినప్పటి నుంచి టీడీపీ శ్రేణుల్లో వణుకు మొదలైందన్నారు. ఎన్నికలు దగ్గరపడటంతో ప్రజలను మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు కొత్త హామీలు ఇస్తున్నారని, 27 నెలల తర్వాత పెన్షన్లు ఇస్తామంటూ కొత్త నాటకాలకు తెరతీశారని పేర్కొన్నారు. నెల్లూరుకు నారాయణ చేసింది శూన్యం నెల్లూరు నగర అభివృద్ధిని మంత్రి నారాయణ పూర్తిగా విస్మరించారని కాకాణి ఆరోపించారు. నారాయణ వల్ల నెల్లూరు ప్రజలకు రూపాయి ఉపయోగం లేదని, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ప్రజలకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. లెగసీ వేస్ట్ నిర్వహణ, చెత్త తొలగింపు, చెట్ల నిర్వహణలో భారీ అవినీతి జరిగిందని కాకాణి ఆరోపించారు. చెత్తలో అవినీతి జరగలేదని చెప్పే దమ్ము, ధైర్యం మంత్రి నారాయణకు ఉందా అని ప్రశ్నించారు. ప్రజల సొమ్ముతో జరిగే పనులకు లెక్కలు చెప్పకుండా తప్పించుకోవడం సరికాదన్నారు. సీఎస్ఆర్ నిధులను నేరుగా ఖర్చు చేసే హక్కు మంత్రి నారాయణకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. లెగసీ వేస్ట్‌పై బహిరంగ చర్చకు సిద్ధం నెల్లూరులో లెగసీ వేస్ట్‌ను శుభ్రపరిచే కార్యక్రమంలో సుమారు రూ.1,200 కోట్ల అవినీతి జరిగిందని తాము చెబుతున్నామని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. అవినీతి జరగలేదని మంత్రి నారాయణ స్పష్టంగా చెప్పలేకపోతున్నారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై మంత్రి నారాయణతో బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. నెల్లూరు కార్పొరేషన్‌లో సిల్ట్ తొలగింపు నుంచి పలు పనులు నారాయణ బినామీలే చేస్తున్నారని ఆరోపించారు. చెట్ల విషయంలో తొలుత కార్పొరేషన్ నిధులని, ఒక్కో చెట్టుకు రూ.12 వేలు ఖర్చు చేస్తున్నారని ప్రశ్నిస్తే సీఎస్ఆర్ నిధులని, లెక్కలు అడిగితే సొంత నిధులని మంత్రి చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. డీఎస్సీ వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యం డీఎస్సీ నియామకాల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు తీవ్ర ఆందోళన కలిగిస్తోందని కాకాణి పేర్కొన్నారు. స్పోర్ట్స్ కోటాను 2 శాతం నుంచి 3 శాతానికి ఎవరి అనుమతితో పెంచారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. 29 రకాల క్రీడలను 65 రకాల క్రీడలకు ఎందుకు పెంచారో స్పష్టం చేయాలన్నారు. జీఏడీ పరిధిలో నిబంధనలను మార్చుతూ జీవోలు ఎలా వచ్చాయో ప్రభుత్వం వివరించాలని కోరారు. సాధారణ పరిపాలన శాఖ ముఖ్యమంత్రి పరిధిలో ఉంటుందని, సీఎం సంతకం, ఆయనకు తెలియకుండా కీలకమైన జీవోలు విడుదల కావడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. మొదట తప్పులు జరగలేదని చెప్పి, ఇప్పుడు అధికారులపై నెపం నెట్టడం సరికాదన్నారు. 72 సీట్లలో విజయం లక్ష్యంగా పనిచేద్దాం నెల్లూరు నగర కార్పొరేషన్‌లోని మొత్తం 72 సీట్లను వైయస్ఆర్‌సీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయం సాధించాలని కాకాణి పిలుపునిచ్చారు. నాయకులు, కార్యకర్తల మధ్య ఉన్న చిన్నచిన్న విభేదాలను పక్కన పెట్టి ఐక్యంగా పనిచేయాలని సూచించారు. వైయస్ఆర్‌సీపీ ఒక కుటుంబమని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చే దిశానిర్దేశం ప్రకారం ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని చెప్పారు. కష్టకాలంలో పార్టీ జెండాను మోసిన ప్రతి కార్యకర్తకు రాబోయే రోజుల్లో తగిన గుర్తింపు ఉంటుందని కాకాణి హామీ ఇచ్చారు. టికెట్ అందరికీ ఇవ్వడం సాధ్యం కాకపోయినా ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అయితే పార్టీ కార్యకర్తల సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. బెదిరింపులకు వైయస్ఆర్‌సీపీ భయపడదు అధికార బలంతో అక్రమ కేసులు, బెదిరింపులకు పాల్పడితే వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు భయపడరని కాకాణి స్పష్టం చేశారు. నెల్లూరు నగరంతో పాటు జిల్లాలో పోలీసులను ఉపయోగించి పార్టీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేయాలని చూస్తే సహించేది లేదన్నారు. వైయస్ఆర్‌సీపీ కార్యకర్తల జోలికి రావాలంటే ముందుగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని, తనను దాటుకుని వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు వైయస్ఆర్‌సీపీకి నాంది కావాలని, పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేసి నెల్లూరు నగరంలో విజయాన్ని సాధించాలని కాకాణి గోవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు.