తాడేపల్లి : పేదలకు నాణ్యమైన వైద్యం, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో నాటి వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. అప్పటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా మెడికల్ కాలేజీల నిర్మాణానికి పెద్దపీట వేశారు. ఐదేళ్ల పాలనలో 17 కొత్త మెడికల్ కాలేజీలకు శ్రీకారం 1923 నుంచి 2019 వరకు దాదాపు శతాబ్ద కాలంలో రాష్ట్రానికి ప్రభుత్వ రంగంలో 12 మెడికల్ కాలేజీలు మాత్రమే వచ్చాయి. అయితే వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలనే లక్ష్యంతో రూ.8,480 కోట్లతో 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లోనూ నిర్మాణ పనులను కొనసాగిస్తూ రూ.2,403 కోట్లు ఖర్చు చేశారు. ఒకేరోజు ఐదు మెడికల్ కాలేజీల ప్రారంభం 2023 సెప్టెంబర్ 15న విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలను వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఒకేసారి ప్రారంభించారు. వీటి ద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీలను కూడా అడ్మిషన్లకు సిద్ధం చేశారు. దీంతో రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు వైద్య విద్యలో మరిన్ని అవకాశాలు కల్పించే దిశగా అడుగులు పడ్డాయి. గ్రామం నుంచి సూపర్ స్పెషాలిటీ వరకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం మెడికల్ కాలేజీల నిర్మాణానికే పరిమితం కాలేదు. ఆరోగ్యశ్రీ పరిధిని 1,000 చికిత్సల నుంచి 3,300 చికిత్సలకు విస్తరించడం, రూ.25 లక్షల వరకు వైద్య సహాయం అందించేలా చర్యలు తీసుకోవడం, గ్రామాల్లో విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటు చేయడం, ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా ఇంటి వద్దకే వైద్య సేవలు అందించడం వంటి కార్యక్రమాలతో ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేసే ప్రయత్నం చేసింది. పేద పిల్లల డాక్టర్ కలలకు భరోసా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటు వల్ల గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు తమ ప్రాంతాలకు దగ్గరగా వైద్య విద్య అభ్యసించే అవకాశం పెరిగింది. ప్రభుత్వ రంగంలో సీట్లు పెరగడం ద్వారా వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యానికి బలం చేకూరింది. అదే సమయంలో కొత్త టీచింగ్ ఆస్పత్రుల ఏర్పాటుతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే అవకాశం ఏర్పడింది. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రజల సొమ్ముతో ఏర్పడిన ప్రజా ఆస్తులు. వాటిని బలోపేతం చేసి మరిన్ని వైద్య సీట్లు, మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉంది. ప్రభుత్వ వైద్య విద్యా సంస్థలను ప్రైవేటీకరణ వైపు తీసుకెళ్లకుండా, ఇప్పటికే ప్రారంభించిన కాలేజీలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ప్రజారోగ్యాన్ని వ్యాపారంగా మార్చకుండా, ప్రభుత్వ వైద్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే పేద ప్రజలకు నిజమైన భరోసా. వైయస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో ప్రారంభమైన ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రాబోయే తరాలకు కూడా ఉపయోగపడేలా వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.