పేదలను బలవంతంగా ఖాళీ చేయించడం అన్యాయం

మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు 

ఓల్డ్ ఆర్ఆర్‌పేట రైల్వే భూముల బాధితులకు వైయ‌స్ఆర్‌సీపీ అండ  

ఎన్టీఆర్ జిల్లా: విజయవాడలోని ఓల్డ్ ఆర్ఆర్‌పేట రైల్వే భూముల వివాదంతో ఆందోళన చెందుతున్న బాధిత కుటుంబాలకు వైయ‌స్ఆర్‌సీపీ అండగా నిలుస్తుందని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఆగస్టు 5లోపు ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ రైల్వే అధికారులు నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన ఆయన, దాదాపు వెయ్యి పేద కుటుంబాల జీవితాలను అనిశ్చితిలోకి నెట్టడం దురదృష్టకరమన్నారు. బాధితులను పరామర్శించిన అనంతరం వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, పార్టీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన, సమస్య పరిష్కారం కోసం అవసరమైతే న్యాయపోరాటం కూడా చేస్తామని ప్రకటించారు. వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పుడల్లా పేదల జీవితాలు ఆందోళనలతో నిండిపోతున్నాయని విమర్శించారు. ఎక్కడ భూమి కనిపించినా దానిపై కన్నేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, పేదలు–రైతులు అనే తేడా లేకుండా భూసేకరణ చర్యలు చేపడుతోందని ఆరోపించారు.

వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కూడా ఇదే సమస్య తలెత్తగా, అప్పటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జోక్యంతో ప్రత్యామ్నాయ పరిష్కారం కోసం చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అజిత్ సింగ్ నగర్‌లోని 25 ఎకరాల నగరపాలక సంస్థ భూమిని రైల్వే శాఖకు కేటాయించే ప్రతిపాదనను రూపొందించి, అప్పటి రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌కు 2021లో లేఖ కూడా పంపినట్లు గుర్తుచేశారు. ప్రస్తుతం వెయ్యికి పైగా కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నా, స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఎంపీ కేశినేని చిన్ని బాధితులను పరామర్శించకపోవడం బాధాకరమన్నారు. ఎన్నికల సమయంలో న్యాయం చేస్తామని ఇచ్చిన హామీలను ఇప్పుడు ఎందుకు విస్మరించారని ప్రశ్నించారు. బాధితులు కోరితే హైకోర్టు సహా అన్ని న్యాయపరమైన మార్గాల్లో వైయ‌స్ఆర్‌సీపీ పూర్తి సహకారం అందిస్తుందని, త్వరలోనే రైల్వే అధికారులను కలిసి సమస్య పరిష్కారంపై చర్చిస్తామని తెలిపారు. పేదలకు న్యాయం జరిగే వరకు వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం కొనసాగుతుందని వెలంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, రాయన భాగ్యలక్ష్మి, అసిఫ్, రూహుల్లా, పుణ్యశిల, మాజీ కార్పొరేటర్ యలకల చలపతిరావు, రబ్బాని, వాసా బాబు, బత్తుల పాండు, పార్టీ నాయకులు, బాధిత కుటుంబాలు పాల్గొన్నారు.
 

Back to Top