కృష్ణా జిల్లా: మచిలీపట్నం నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలపై వైయస్ఆర్‌సీపీ నాయకులు రైతులతో కలిసి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. బందరు వెస్ట్ మండలంలోని శివగంగ డ్రైన్ కాలువ గట్టును అక్రమంగా తవ్వి భారీ ఎత్తున మట్టిని తరలించడంతో వందల ఎకరాల వ్యవసాయ భూములకు ముప్పు వాటిల్లిందని ఆందోళన వ్యక్తం చేశారు. మచిలీపట్నంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు సమర్పించిన ఫిర్యాదులో, బందరు వెస్ట్ మండల పరిధిలోని శివగంగ డ్రైన్ కాలువ గట్టుపై మంత్రి అనుచరుడు పిప్పళ్ళ వెంకన్న ఆధ్వర్యంలో వందలాది ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా మట్టి తరలించారని ఆరోపించారు. కాలువ గట్టుపై 10 నుంచి 15 అడుగుల ఎత్తులో ఉన్న మట్టిదిబ్బలను తవ్వి తరలించడం వల్ల ప్రభుత్వ ఆస్తికి నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. కాలువ గట్టు బలహీనపడటంతో శివగంగ డ్రైన్ పరిధిలోని సుమారు 600 ఎకరాల వ్యవసాయ భూములకు నీటిముంపు ప్రమాదం ఏర్పడిందని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తవ్వి తరలించిన వారిపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.