రాజధాని రైతుల సమస్యలపై వైయ‌స్ఆర్‌సీపీ సీఆర్డీఏ పరిరక్షణ కమిటీతో సమావేశం 

  బలవంతపు భూసేకరణ, ప్రభుత్వ దౌర్జన్యాలపై రైతుల ఆవేదన 

 న్యాయపోరాటంలో అండగా నిలవాలని వైయ‌స్ఆర్‌సీపీని కోరిన రాజధాని రైతులు

తాడేప‌ల్లి: అమరావతి రాజధాని ప్రాంతంలో భూములు ఇవ్వని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, బలవంతపు భూసేకరణ, ప్రభుత్వ చర్యలపై రాజధాని రైతులు తాడేపల్లిలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీఆర్డీఏ పరిరక్షణ కమిటీతో సమావేశమయ్యారు. తమ భూములను బలవంతంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం పోలీసు బలగాలను ఉపయోగిస్తోందని, న్యాయపోరాటంలో వైయ‌స్ఆర్‌సీపీ తమకు అండగా నిలవాలని రైతులు విజ్ఞప్తి చేశారు. తాడేపల్లిలో జరిగిన ఈ సమావేశంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని, ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, డైమండ్ బాబు, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, రాజధానికి భూములు ఇవ్వలేదనే కారణంతో ప్రభుత్వం తమపై అనేక రకాల ఒత్తిళ్లు, వేధింపులకు పాల్పడుతోందని కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. బలవంతపు భూసేకరణను కోర్టులో సవాల్ చేసినప్పటికీ, ప్రభుత్వం పోలీసుల సహాయంతో తమ పొలాల్లోకి ప్రవేశించి దౌర్జన్యంగా రోడ్లు వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూముల్లో కొండవీటి వాగు గట్టు తెంచి నీటిని వదిలి పంటలకు నష్టం కలిగించారని, రాజధాని పేరుతో రైతుల హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. తమ సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు కమిటీ సభ్యులు గ్రామాలకు రావాలని కోరిన రైతులు, న్యాయపరంగా మరియు రాజకీయంగా తమకు అండగా నిలవాలని వైయ‌స్ఆర్‌సీపీ సీఆర్డీఏ పరిరక్షణ కమిటీని విజ్ఞప్తి చేశారు.

 
రైతులపై రౌడీయిజం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం: అంబటి రాంబాబు 
అమరావతి రాజధాని ప్రాంతంలో రైతులపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. రైతులను భయభ్రాంతులకు గురిచేసి, పోలీసు బలగాలు, బుల్డోజర్లతో పంటలను ధ్వంసం చేస్తూ భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. రైతులకు న్యాయం జరిగే వరకు వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు మాట్లాడుతూ, భూములు ఇవ్వని చిన్న, సన్నకారు రైతులపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపించారు. హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగానే భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం కోర్టు ధిక్కరణేనని పేర్కొన్నారు. సుమారు 2.75 ఎకరాల్లో పండిన పంటలను బుల్డోజర్లతో ధ్వంసం చేయించడం చంద్రబాబు ప్రభుత్వ రైతు వ్యతిరేక వైఖరికి నిదర్శనమన్నారు.

మార్కెట్‌లో కోట్ల రూపాయల విలువ చేసే భూములకు తక్కువ పరిహారం నిర్ణయించడం అన్యాయమని అన్నారు. ప్రభుత్వం రైతులకు రూ.2.47 కోట్లు మాత్రమే ఇస్తామని చెబుతుంటే, అదే ప్రాంతంలో ప్రైవేటు కొనుగోళ్లలో ఎకరాలకు మరింత అధిక ధరలు చెల్లించారని గుర్తుచేశారు. రైతుల నోట్లో మట్టి కొట్టి భూములను కాంట్రాక్టర్లకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.  సీఆర్‌డీఏ అధికారులు ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా బ్రోకర్లలా వ్యవహరిస్తున్నారని విమర్శించిన అంబటి రాంబాబు, రైతులను బలవంతంగా భూముల నుంచి బయటకు లాగితే వైయ‌స్ఆర్‌సీపీ సహించబోదని హెచ్చరించారు. రైతుల హక్కుల పరిరక్షణ కోసం చివరి వరకు న్యాయపరంగా, ప్రజా ఉద్యమాల ద్వారా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Back to Top