గిరిజన యువతి హత్య అత్యంత దారుణం

నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి

మాజీ ఎమ్మెల్యే కళావతి డిమాండ్‌

పాలకొండ : పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గంలోని బర్నసీతంపేట గ్రామానికి చెందిన గిరిజన యువతి బిడ్డిక ఉషారాణి (32) హత్య ఘటన అత్యంత దారుణమని పాలకొండ మాజీ ఎమ్మెల్యే, పాలకొండ నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త విశ్వాసరాయి కళావతి ఆవేదన వ్యక్తం చేశారు.

ఉషారాణిని అత్యంత కిరాతకంగా హత్య చేసి, చేతులు కాళ్లు వెనక్కి కట్టి చెరువులో పడేసిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న కళావతి ఆసుపత్రికి చేరుకుని మృతురాలి తల్లిదండ్రులను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైయ‌స్ఆర్‌సీపీ తరఫున పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా కళావతి మాట్లాడుతూ, ఉషారాణి హత్య ఘటన అత్యంత విషాదకరమని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని విమర్శించారు. మహిళలపై దాడులు, హత్యలు, లైంగిక వేధింపుల ఘటనలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 
ప్రశాంతతకు మారుపేరైన పాలకొండ ప్రాంతంలో ఇలాంటి దారుణ ఘటన చోటుచేసుకోవడం బాధాకరమని పేర్కొన్నారు. మహిళలపై దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని అన్నారు.

ఉషారాణి కుటుంబానికి పూర్తి న్యాయం జరిగే వరకు గిరిజన, దళిత ప్రజలతో కలిసి పోరాటం కొనసాగిస్తానని తెలిపారు. నిందితులను తక్షణమే గుర్తించి అరెస్టు చేసి, చట్ట ప్రకారం అత్యంత కఠిన శిక్షలు విధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మహిళల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, గిరిజన, దళిత సంఘాల ప్రతినిధులు, పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
 

Back to Top