అరకులోయలో వైయ‌స్ఆర్‌సీపీ భారీ నిరసన 

వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు నిర్వహించిన  “చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” నిరసన కార్యక్రమంతో అరకులోయ దద్దరిల్లింది. అరకు నియోజకవర్గంలోని అరకు వ్యాలీ మండల కేంద్రంలో ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించి కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు సాగిన ఈ ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో సూపర్‌ సిక్స్‌  పేరుతో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. మెగా డీఎస్సీ పేరుతో నిర్వహించిన నియామకాల్లో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. డీఎస్సీ పరీక్షల కోసం సంవత్సరాల తరబడి శ్రమించి, వేలాది రూపాయలు ఖర్చు చేసిన అభ్యర్థులు ఉద్యోగాలు పొందలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. డీఎస్సీలో జరిగిన అవకతవకలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో సీఆర్‌టీలుగా పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు చెల్లించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. 
ఈ కార్యక్రమంలో అరకు ఎంపీ గుమ్మ తనుజరాణి, అరకు పార్లమెంట్‌ పరిశీలకులు చింతలపూడి వెంకటరమణ, ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర, వైయ‌స్ఆర్‌సీపీ యువజన, ఎస్టీ సెల్‌, విద్యార్థి విభాగాల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Back to Top