జగనన్న నామస్మరణ చేయనిదే టీడీపీకి పూట గడవదు

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత

కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన ప్రజలను మోసం చేసిన కాలం

‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తున్న వైయ‌స్ఆర్‌సీపీ

నెల్లూరు : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజలకు చేసిన మోసాలను, ఎన్నికల హామీల అమలులో జరిగిన వైఫల్యాలను ఎండగట్టేందుకు వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నామని చెప్పారు. జూన్‌ 4 నుంచి 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

ప్రజల సమస్యలు తెలుసుకుని వారి తరఫున పోరాడాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా తమపై ఉందన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజల అవసరాలు, కష్టాలతో సంబంధం లేకుండా కేవలం అధికారాన్ని, సంపదను కాపాడుకోవడంపైనే దృష్టి ఉందని విమర్శించారు. ఎన్నికల సమయంలో సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ పేరుతో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు. తల్లి వందనం, ఆడబిడ్డ నిధి, ఉచిత గ్యాస్‌ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలు అమలు కాకపోవడంతో మహిళలు తీవ్ర నిరాశకు గురయ్యారని అన్నారు.

తల్లి వందనం పథకం కింద పూర్తి మొత్తాన్ని చెల్లించకుండా వేలాది కుటుంబాలను పథకం నుంచి తప్పించారని, ఆడబిడ్డ నిధి పేరుతో నెలకు రూ.1,500 ఇస్తామని చెప్పి మహిళలను మోసం చేశారని విమర్శించారు. ఉచిత బస్సు ప్రయాణ హామీని కూడా అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగి సామాన్య ప్రజల జీవనం కష్టతరంగా మారిందన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ధాన్యం, మొక్కజొన్న, పత్తి, పొగాకు, మామిడి తదితర పంటలకు సరైన ధరలు లేక రైతులు నష్టపోతున్నారని చెప్పారు. మెగా డీఎస్సీ పేరుతో ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని పూజిత ఆరోపించారు. స్పోర్ట్స్‌ కోటా నియామకాలలో అక్రమాలు జరిగాయని, గతంలో ఉన్న 29 క్రీడలను 65కు ఎందుకు పెంచారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. స్పోర్ట్స్‌ కోటా శాతం 2 నుంచి 3కు ఎందుకు పెంచారో కూడా వివరణ ఇవ్వాలని కోరారు. పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్లు ఉన్న వారికి ఉద్యోగాలు ఇవ్వడం, పరీక్షలు లేకుండా నియామకాలు చేపట్టడం వెనుక ఉన్న కారణాలను ప్రభుత్వం వెల్లడించాలని అన్నారు. డీఎస్సీ నియామకాలలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం పారదర్శకంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.

విశాఖ ఉక్కు కర్మాగార ప్రమాదం సందర్భంగా ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల నుంచి వచ్చిన స్పందనను ప్రస్తావించిన ఆమె, బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని జగన్‌ హామీ ఇచ్చారని తెలిపారు. ప్రజల కష్టసుఖాల్లో జగన్‌ ఎల్లప్పుడూ ఉంటారని పేర్కొన్నారు. చంద్రబాబు నిర్వహించిన మహానాడులో కూడా ప్రభుత్వ విజయాల కంటే జగన్‌ పేరునే ఎక్కువగా ప్రస్తావించారని ఎద్దేవా చేశారు. “జగనన్న నామస్మరణ చేయనిదే టీడీపీకి పూట గడవదు” అని వ్యాఖ్యానించారు. జగన్‌ను విమర్శించకుండా టీడీపీ ఒక్క కార్యక్రమం నిర్వహించలేదని అన్నారు. రేపు జూన్‌ 12న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన ర్యాలీలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై కూటమి ప్రభుత్వంపై తమ నిరసనను తెలియజేయాలని కాకాణి పూజిత పిలుపునిచ్చారు.
 

Back to Top