కోడుమూరు: "వెన్నుపోటుకు రెండేళ్లు" కార్యక్రమంలో భాగంగా ఈ నెల 12న కోడుమూరు పట్టణంలో నిర్వహించనున్న నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని కుడా మాజీ చైర్మన్, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి, కోడుమూరు నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ ఇన్‌చార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో ర్యాలీ విజయవంతానికి సంబంధించిన సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆదిమూలపు సతీష్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రైతులు, యువత, మహిళలు, విద్యార్థులు సహా అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ విధానాలతో తీవ్ర నిరాశకు గురయ్యారని అన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఈ కార్యక్రమం వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ నెల 12న నిర్వహించే నిరసన ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ప్రజా వ్యతిరేక విధానాలపై గళమెత్తేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.