జగన్‌ 2.0 లో పార్టీ కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం

అన్ని కార్యక్రమాలు వారి చేతుల మీదుగానే కొనసాగిస్తాం

వైయస్‌ జగన్‌ ప్రకటన

గిరిజనులకు, ఆ ప్రాంతాల వారికి మేలు చేసింది మనమే

వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో ఏజెన్సీలో మెడికల్‌ కాలేజీలు

మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు. ట్రైబల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ

ట్రైబల్‌ యూనివర్సిటీ కూడా అప్పుడే ఏర్పాటైంది

అటవీ భూములపై గిరిజనులకు హక్కుల కల్పన

గిరిజనులకు ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ భూపట్టాల పంపిణీ

గుర్తు చేసిన శ్రీ వైయస్‌ జగన్‌

రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీకి చెందిన స్ధానిక సంస్ధల మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో వైయ‌స్ఆర్‌సీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమైన మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.

రంపచోడవరం నియోజకవర్గం పార్టీ ఇంఛార్జ్‌ నాగులాపల్లి ధనలక్ష్మితో పాటు, పార్టీకి చెందిన స్థానిక మాజీ 
సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ముఖ్య నాయకులు హాజరు.

రెండేళ్లలోనే కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత

నాటి 5 ఏళ్ల జగన్‌ పాలన. ఇప్పుడు 2 ఏళ్ల చంద్రబాబు పాలన

రెండింటినీ పోల్చి చూస్తున్న ప్రజలు. ప్రతి ఇంట్లోనూ చర్చ

జగన్‌ను దూరం చేసుకున్నామని భావిస్తున్న ప్రజలు

అన్ని వర్గాలను మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వం

అందుకే అందరిలోనూ తీవ్ర అసంతృప్తి

శ్రీ వైయస్‌ జగన్‌ వెల్లడి

పేదలకు అండగా పార్టీ కార్యకర్తలు నిలవాలి

వారి సమస్యలపై పోరాడాలి. తోడుగా జత కట్టాలి

వచ్చే రెండేళ్లు పార్టీకి ఎంతో కీలకమైన సమయం

పార్టీలో ప్రతి ఒక్కరూ నిత్యం ప్రజలతో మమేకం కావాలి

మీరు ప్రజల కోసం నిలబడండి. వారి కోసం కష్టపడండి

మీ అందరి బాధ్యత నాది. నేను స్వయంగా చూసుకుంటాను

సమావేశంలో శ్రీ వైయస్‌ జగన్‌ స్పష్టీకరణ

తాడేపల్లి: జగన్‌ 2.0లో కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని, ప్రతి కార్యక్రమం వారి చేతులమీదుగానే జరిపిస్తామని మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ  అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. వచ్చే రెండేళ్లు పార్టీకి ఎంతో కీలక సమయం అన్న ఆయన, ఈ రెండేళ్లు ప్రతి కార్యకర్త పార్టీని భుజాన వేసుకోవాలని, పేద ప్రజలకు అండగా నిలుస్తూ, వారి సమస్యలపై పోరాడాలని కోరారు. నిత్యం ప్రజలతో మమేకం కావాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలందరి బాధ్యత తనది అని స్పష్టం చేశారు.
    నియోజకవర్గాల వారీగా ముఖ్య నాయకులతో భేటీ అవుతున్న శ్రీ వైయస్‌ జగన్, ఆ దిశలో రంపచోడవరం నియోజకవర్గంలో పార్టీకి చెందిన స్ధానిక సంస్ధల మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా పలకరించిన ఆయన, ఆప్యాయంగా మాట్లాడారు.
ఈ సందర్భంగా సమావేశంలో శ్రీ వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే..:

ఈరోజు దానిపైనే ప్రతి ఇంట్లో చర్చ:
    రంపచోడవరం నియోజకవర్గం నుంచి వచ్చిన నా ఆత్మీయులందరికీ స్వాగతం పలుకుతున్నాను. నియోజకవర్గాల వారీగా పార్టీ వారిని కలిస్తే బాగుంటుందన్న ఆలోచనతో ఈ సమావేశాలు నిర్వహిస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి నాకన్నా మీకే బాగా తెలుసు. చూస్తుండగానే రెండేళ్లు గడిచాయి. ఈ రెండేళ్లలో జరిగిన పాలన ప్రతి ఇంట్లో చర్చనీయాంశంగా మారింది. ఇంతకు ముందు జగన్‌ను చూశాం. ఆయన 5 ఏళ్ల పాలన చూశాం. ఇప్పుడు చంద్రబాబు రెండేళ్ల పాలన మధ్య తేడా ఏమిటనేది ఈరోజు ప్రతి ఇంట్లో చర్చనీయాంశంగా ఉంది. మన 5 ఏళ్ల పాలనలో గర్వంగా చెప్పగలుగుతాను. గతంలో ఎప్పుడూ చూడని, ఎప్పుడూ జరగని విధంగా పాలన అందించాం. దీన్ని నేను గర్వంగా చెప్పగలను.

మనం రాక ముందు.. మనం వచ్చిన తర్వాత:
    మనం రాక ముందు వరకు మ్యానిఫెస్టో అంటే ఏ మాత్రం విలువ ఉండేది కాదు. ప్రజలకు ఎన్నెన్నో చేస్తామని ఎన్నికల్లో మాట చెప్పి, ఆ తర్వాత దాన్ని చెత్తబుట్టలో వేసేవారు. అదే మనం వచ్చాక, తొలిసారిగా మ్యానిఫెస్టోను ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్‌లా భావించి, 99 శాతం అమలు చేసిన పార్టీ ఒక్క మన వైయ‌స్ఆర్‌సీపీ మాత్రమే. బడ్జెట్‌ సమావేశాలకు ముందే పథకాలు, తేదీలు ప్రకటించి, క్రమం తప్పకుండా అమలు చేసింది కేవలం వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం మాత్రమే. గతంలో ఎప్పుడూ కనీవినీ ఎరగని విధంగా పరిపాలనలో మార్పులు కూడా చేశాం.
    మనం రాకముందు స్కూళ్లు ఎలా ఉండేవి. ఆ తర్వాత మనం వచ్చిన తర్వాత ఎలా మారాయి అనేది నాకన్నా మీరు బాగా చెప్పగలుగుతారు. మనం రాక ముందు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ అమలు ఎలా ఉండేది. మనం వచ్చాక ఆరోగ్యశ్రీని ఎంత బాగా అమలు చేశాం. మీరే బాగా చెప్పగలరు. మనం రాకముందు వ్యవసాయం ఎలా ఉండేది? రైతుల ఎన్ని ఇబ్బందులు పడ్డారు. మనం వచ్చిన తర్వాత రైతన్న ఎలా బాగు పడ్డాడు. వ్యవసాయంలో ఎలాంటి మార్పులు వచ్చాయి అన్నది మీరే బాగా చెప్పగలరు.
    మనం రాక ముందు గ్రామాల్లో ఏ పథకం అందక, పరిపాలన అందక, దేనికైనా ఎవరెవరికో డబ్బు ఇవ్వాల్సిన పరిస్థితి. అదే మన వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక, పాలన ఎలా మారింది? గ్రామస్థాయిలో ప్రభుత్వ సేవలు ఎలా అందాయి? మనం వచ్చాక ఎలాంటి మార్పులు వచ్చాయి. అన్నీ చూపించాం. సచివాలయాల వ్యవస్థ. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌. ఇంటి గడవ వద్దే ప్రభుత్వ పథకాలు అందాయి. ఇన్నిన్ని గొప్ప మార్పులు తీసుకురాగలిగాం.
    విద్య, వ్యవసాయం, వైద్య రంగంలో పెను మార్పులు తీసుకొచ్చాం. దిశ యాప్‌తో మహిళలకు రక్షణ కల్పించాం. వారికి తోడుగా నిలబడ్డాం. ప్రతి గ్రామంలో ఒక మహిళా కానిస్టేబుల్‌ సచివాలయంలో ఉంచాం. 

గిరిజనులు. గిరిజన ప్రాంతాల్లో మార్పులు:
    ఇంకా ఎప్పుడూ చూడని విధంగా గిరిజన ప్రాంతాల అభివృద్ధి కూడా మన హయాంలోనే జరిగింది. ఎప్పుడూ చూడని విధంగా గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చేశాం. 3,22,528 ఎకరాలు, ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ డీకేటీ భూముల భూపట్టాలు పంపిణీ చేయడం జరిగింది. ఒక్క ఇదే రంపచోడవరంలోనే 20 వేల మందికి 80 వేల ఎకరాల భూముల ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ డీకే పట్టాల పంపిణీ చేశాం.
    ఎప్పుడూ జరగని విధంగా రాష్ట్రంలో 17 కొత్త మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుడితే, వాటిలో ఒక్క మన ప్రాంతంలోనే పాడేరు, పార్వతీపురంతో పాటు, ఏజెన్సీ ముఖ ద్వారమైన నర్సీపట్నంలో మూడు మెడికల్‌ కాలేజీలు కేవలం మన గిరిజన ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. కురుపాంలో ట్రైబల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ, సాలూరులో ట్రైబల్‌ యూనివర్సిటీ.. కేవలం మన గిరిజనులు బాగు పడాలి. వారు చదువుల్లో ముందుండాలన్న ఆరాటం కేవలం మన ప్రభుత్వంలోనే కనిపించింది.
    ఎప్పుడూ చూడని విధంగా ఐటీడీఏల పరిధిలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు.. సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, బట్టాయగూడెం, దోర్నాలలో తలపెట్టి, వేగంగా పనులు చేశాం. ఇవన్నీ ఒక్క వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలోనే అని గర్వంగా చెప్పగలను. ఒక తపన, తాపత్రయంతోనే ఇవన్నీ చేయడం జరిగింది. మనుషుల జీవితాలు బాగు పడాలి. వారి బతుకులు మారాలి. చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలన్న తపనతో పని చేశాం.

ఎన్నికల ముందు వారేం చెప్పారు:
    ఎన్నికల ముందు చంద్రబాబు ఏమన్నాడు. జగన్‌ ఇచ్చేవి మాత్రమే కాదు. అంతకన్నా ఎక్కువ ఇస్తామన్నారు. ఇంకా ప్రతి ఇంటికి చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ ఫోటోలు, సంతకాలతో బాండ్లు పంపారు.
    ప్రతి ఇంట్లో 50 ఏళ్లు నిండిన వారున్నారా?. అయితే నీకు రూ.4 వేలు, నీకు రూ.4 వేలు. అలా ఏడాదికి రూ.48 వేలు. ఇంకా 18 ఏళ్లు నిండిన అక్కచెల్లెమ్మలు కనబడితే ఏడాదికి నీకు రూ.18 వేలు, నీకు రూ.18 వేలు అని, ఇంకా 18 ఏళ్లు నిండిన యువకుడు కనిపిస్తే.. నీకు ఏడాదికి రూ.36 వేలు, నీకు రూ.36 వేలు అని చెప్పారు. నిరుద్యోగి ఉంటే ఏడాదికి రూ.36 వేలు. అంతటితో ఆగలేదు. మీకు ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలు ఉన్నాయా? మీరు రైతులా? అయితే మీకు రూ.26 వేలు ఇస్తామన్నారు.
    అలా అంతా మోసం. మనం ఇచ్చిన దానికన్నా మూడింతలు ఎక్కువ ఇస్తామన్నారు. అలా మన కన్నా మూడింతలు ఎక్కువ ఇస్తామన్నారు. ఇంటింటికీ బాండ్లు ఇచ్చి, మ్యానిఫెస్టో చూపి, ఒక పద్ధతి ప్రకారం మోసం చేశారు. ఎన్నికలైపోయాయి. 

మరి ఇప్పటి పరిస్థితి ఏమిటి?:
    రెండేళ్లు గడిచాయి. మరి ఇప్పుడు పరిస్థితి ఏమిటన్నది చూస్తే.. ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు ఏడాదికి రూ.18 వేల చొప్పున, రెండేళ్లలో రూ.36 వేలు బాకీ. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల చొప్పున, రెండేళ్లలో ప్రతి పిల్లాడికి రూ.72 వేలు బాకీ. 50 ఏళ్లు నిండిన వారికి నెలకు రూ.4 వేల చొప్పున,  రెండేళ్లలో రూ.96 వేలు బాకీ.
    మరోవైపు అమ్మ ఒడి తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. రెండో ఏడాది 20 లక్షల మందికి ఎగ్గొట్టారు. మిగిలిన వారికి ఇచ్చింది కూడా రూ.8 వేలు. రూ.9 వేలు మాత్రమే. కొందరికి రూ.13 వేలు ఇచ్చారు.
రైతు భరోసా కింద పీఎం కిసాన్‌ కాకుండా రూ.20 వేలు ఇస్తాన్నాడు. అంటే రెండేళ్లకు రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా, ఇచ్చింది రూ.14 వేలు. ఇక్కడ బాకీ రూ.26 వేలు. గ్యాస్‌ సిలిండర్లు ఏటా 3 ఉచితం అన్నారు. రెండేళ్లలో 2 మాత్రమే ఇచ్చారు. అది కూడా అందరికీ ఇవ్వలేదు.

ప్రశ్నిస్తే ఓర్చుకోలేకపోతున్నారు:
    అందుకే చంద్రబాబుకు ఎందుకు ఓటేశాం? జగన్‌ను ఎందుకు పోగొట్టుకున్నామనే విషయంపై ప్రతి ఇంట్లో చర్చ జరుగుతుంది.
చూస్తుండగానే రెండేళ్లు గడిచాయి. మిగిలింది మూడేళ్లు మాత్రమే.
ఏడాదిన్నర తర్వాత నా పాదయాత్ర మొదలవుతుంది. అందుకే త్వరలోనే దుర్మార్గమైన పాలన పోతుంది.
    అంతా అన్యాయమైన పాలన. చంద్రబాబు మోసాలు ప్రశ్నిస్తే దొంగ కేసులు. దొంగ సాక్ష్యాలు. వేధింపులు. రెడ్‌బుక్‌ రాజ్యాంగం. అందరినీ కోరేది ఒక్కటే. చీకటి ఎప్పటికైనా పోతుంది. వెలుగు రాక తప్పదు. పగటి పూట సూర్యుడు వస్తాడు.

పేదల పక్షాన నిలబడండి.
జగన్‌ 2.0లో మీకే అత్యధిక ప్రాధాన్యం:

    ఇంకా మూడేళ్లు. చివరి ఏడాది ఎన్నికల ఏడాది కాబట్టి. ఈ రెండేళ్లు చాలా ముఖ్యం. ఈ కాలంలో పార్టీని మోయాల్సిన బాధ్యత, పార్టీ తరపున నిలబడడం, పోరాడడం, బాధితులైన ప్రజల పక్షాన నిలబడాల్సిన బాధ్యత మీ అందరి భూజస్కంధాలపై ఉందని మర్చిపోవద్దు.
మీ అందరికీ నేను చెప్పేది ఒక్కటే. రేపు వైయస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్‌ 2.0 లో కార్యకర్తలను బాగా చూసుకుంటాను. 
గత పాలనలో మన కార్యకర్తలను అంత బాగా చూసి ఉండకపోవచ్చు. మనం రాగానే కోవిడ్‌ రావడంతో, రెండేళ్లు పరిపాలన మీదే ఎక్కువ దృష్టి పెట్టాల్సి వచ్చింది.
    కానీ, ఈసారి అలా ఉండదు. ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా మీ ఆధ్వర్యంలోనే, మీ చేతుల మీదుగానే అందిస్తాం. మీ అందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే. మీరు పేదలకు అండగా, తోడుగా ఉండండి. అది మాత్రమే మిమ్మల్ని కోరుతున్నాను. మిగతా అన్ని విషయాల్లో మీకు తోడుగా నేనుంటాను.
    కాగా, పోలవరం ముంపు ప్రాంతాల్లో పరిహారం చెల్లింపుల్లో వివక్ష కొనసాగుతోందని సమావేశంలో ప్రస్తావించగా, దీనిపై పార్టీ తరపున పోరాడుతామని చెప్పారు. నిర్వాసితులు తమ పార్టీలో చేరితేనే, పరిహారం ఇస్తామని చెబుతున్నారని, ఇది ఏ మాత్రం సరికాదని స్పష్టం చేశారు. వీటన్నింటిపై పోరాటం కొనసాగిస్తామని, అయినా న్యాయం జరగకపోతే, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేద్దామని వివరించారు.

Back to Top