తూర్పుగోదావరి: రాష్ట్రంలో రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నా ప్రభుత్వం వారికి అండగా నిలవడంలో విఫలమైందని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శించారు. రైతులకు న్యాయం చేయాలనే లక్ష్యంతోనే వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి దేవరాపల్లిలో పొగాకు రైతులను పరామర్శించేందుకు వస్తున్నారని తెలిపారు. రైతు నష్టపోతే.. కంపెనీలకు భారీ లాభాలు పొగాకు రైతులు ఎకరానికి సుమారు రూ.2.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టి ఐదు నెలలు శ్రమిస్తున్నప్పటికీ కనీస గిట్టుబాటు ధర కూడా లభించడం లేదని జక్కంపూడి రాజా ఆవేదన వ్యక్తం చేశారు. ఒక కిలో పొగాకు ద్వారా సిగరెట్ కంపెనీలు వేల రూపాయల ఆదాయం పొందుతున్నప్పటికీ, రైతుకు మాత్రం కిలోకు రూ.250 కూడా అందడం లేదని అన్నారు. విదేశాల నుంచి అధిక ధరకు పొగాకు కొనుగోలు చేస్తున్న కంపెనీలు స్థానిక రైతులను నిర్లక్ష్యం చేయడం వల్ల రైతులకు భారీ నష్టం జరుగుతోందని పేర్కొన్నారు. రైతుల పక్షాన వైయస్ఆర్‌సీపీ పోరాటం చిత్తూరు మామిడి రైతులు, గుంటూరు మిర్చి రైతులు సమస్యలు ఎదుర్కొన్న సమయంలోనూ వైయస్ జగన్ వారి కోసం పోరాడారని గుర్తు చేశారు. ఇప్పుడు పొగాకు రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ దేవరాపల్లిలో నిర్వహించే కార్యక్రమం ద్వారా రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి వారి ఆర్థిక ఇబ్బందులను తొలగించాలని జక్కంపూడి రాజా ప్రభుత్వాన్ని కోరారు.