నల్లజర్ల : జగనన్న పుట్టినరోజును ఘనంగా నిర్వహించుకున్న దళిత యువకులపై అక్రమ కేసులు బనాయించి, పోలీసులు చిత్రహింసలు పెట్టడం దారుణమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా అన్నారు. చోడవరం ఘటనలో పోలీసుల వ్యవహారం చట్టాన్ని ఉల్లంగించేలా ఉందని ఆయన మండిపడ్డారు. ఈ ఘటనపై న్యాయపోరాటం చేస్తామని పేర్కొన్నారు. నల్లజర్లలో జరిగిన మీడియా సమావేశంలో జక్కంపూడి రాజా మాట్లాడుతూ, దళిత యువకులపై పెట్టిన అక్రమ కేసులను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదన్నారు. చోడవరం ఘటనపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పోలీసుల దురుసు వైఖరిపై మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. పోలీసులు చట్టానికి లోబడి పనిచేయాల్సి ఉండగా, అధికార దర్పంతో వ్యవహరిస్తూ దళిత యువకులపై చిత్రహింసలకు పాల్పడ్డారని ఆరోపించారు. ముఖ్యంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ నాయక్ ఓవరాక్షన్ మానుకోవాలని హెచ్చరించారు. ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మాజీ హోం మంత్రి తానేటి వనిత, రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ మంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, నల్లజర్ల పార్టీ అధ్యక్షులు వెల్లంకి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. వారందరూ దళితులపై జరుగుతున్న అక్రమాలపై ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా విమర్శించారు. దళిత యువకుల హక్కుల పరిరక్షణ కోసం చివరి వరకు పోరాడుతామని, బాధితులకు న్యాయం జరిగే వరకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గదని నేతలు స్పష్టం చేశారు.