పల్నాడు జిల్లా : సత్తెనపల్లి వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ ఇంట్లో అర్ధరాత్రి పోలీసులు సోదాలు నిర్వహించడంపై వైయస్ఆర్‌సీపీ పీఏసీ సభ్యులు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి పోలీసులు ఇంటికి వచ్చి తనిఖీలు నిర్వహిస్తే అక్కడ ఉన్న పిల్లలు, మహిళలు ఎంతటి భయాందోళనలకు గురవుతారో ప్రభుత్వం ఆలోచించాలన్నారు. తప్పులను ప్రశ్నిస్తే కేసులు, అరెస్టులు, సోదాలతో భయపెట్టడం ప్రజాస్వామ్య విధానం కాదని బొల్లా బ్రహ్మనాయుడు పేర్కొన్నారు. విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద వైయస్ఆర్‌సీపీ నేతలు శాంతియుతంగా నిరసన చేపడుతుంటే టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడుతున్నా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. డీఎస్సీ క్రీడా కోటా నియామకాలపై వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని, నియామక ప్రక్రియపై నిష్పక్షపాత సీబీఐ విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని కోరారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లు ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకోవడం, ప్రశ్నించే గొంతులను అణచివేయడం మానుకుని ప్రజలకు జవాబుదారీగా పాలించాలని బొల్లా బ్రహ్మనాయుడు సూచించారు.