తాడేపల్లి: విద్యార్ధుల ఫీజు రీయింబర్స్ మెంట్ పథకంపై శాసనమండలి సాక్షిగా మంత్రి నారా లోకేష్ పచ్చి అబద్దాలు మాట్లాడారని వైయస్ఆర్‌సీపీ వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 7 త్రైమాసికాల ఫీజు బకాయిలు చెల్లించకుండా విద్యార్ధుల జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చేనాటికి వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం రూ.4వేల కోట్ల బకాయిలు పెట్టిందన్న లోకేష్... దమ్ముంటే ఆ వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. వాస్తవానికి 2019లో చంద్రబాబు వదిలిపెట్టిన రూ.4 వేల కోట్ల రీయింబర్స్ మెట్ బకాయిలను వైయస్.జగన్ నేతృత్వంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెల్లించిందని స్పష్టం చేశారు. ఇదో నిరంత ప్రక్రియ అన్న ఆయన.. కూటమి ప్రభుత్వం తక్షణమే విద్యార్ధుల ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... ● 2019లో రూ.4 వేల కోట్లు చంద్రబాబు బకాయిలు... కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు రూ.1200 కోట్లు చెల్లించాం, ఇంకా రూ.1400 కోట్లు బకాయిలు ఉన్నాయని మంత్రి లోకేష్ కౌన్సిల్ సాక్షిగా అబద్దాలు చెప్పాడు.అబద్దాలు ఎలా చెప్పాలో నారావారిని చూసి నేర్చుకోవచ్చు. ఇంతకుముందు రూ.4 వేల కోట్లు వైఎస్సార్స్ కాంగ్రెస్ పార్టీ బకాయిలు పెట్చిందని చెప్పారు. వాస్తవానికి 2019లో తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయేనాటికి రూ.2400 కోట్లు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించకుండా బకాయిలు పెట్టి వెళ్లిన మాట వాస్తవం కాదా? 2020 మార్చికల్లా ముఖ్యమంత్రి వైయస్.జగన్ నేతృత్వంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్న బకాయిలన్నీ చెల్లించింది. ఇదో నిరంతర ప్రక్రియ. ప్రజలకిచ్చిన హామీ మేరకు ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఆ మేరకు వైయస్.జగన్ హయాంలో 2020 మార్చి నెలలో రూ.4,500 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ కింద చెల్లించారు. ● దమ్ముంటే వివరాలు బయటపెట్టండి... కూటమి నేతలు చెబుతున్నట్టు 2024 నాటికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫీజు బకాయిలు రూ.4వేల కోట్లు బకాయిలు ఉంటే ఆ వివరాలు బయటపెట్టాలి, అంతేకాకుండా ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ఉంటే వాటిని తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఇది విద్యార్ధులకిచ్చిన హామీ. ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లింపులపై కూటమి ప్రభుత్వం కమిటీ కూడా వేసింది. నాలుగు నెలలు గడుస్తున్నా దాని ఊసే లేకుండా పోయింది. గత ఏడాది జనవరి నుంచి మార్చి క్వార్టర్ కు సంబంధించిన బకాయిలు చెల్లించడానికి అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ సిద్దమవుతుంటే... దానిపై కోర్టులో కేసు వేసి మరీ తెలుగుదేశం అడ్డుపడింది. ఆ తర్వాత ఏఫ్రిల్- జూన్ క్వార్టర్ కి సంబంధించి ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నిల్చిపోయింది. అనంతరం కూటమి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం జూలై -సెప్టెంబరు మూడో క్వార్టర్, అక్టోబర్ - డిసెంబరు నాలుగో క్వార్టర్ బకాయిలు చెల్లించకపోగా.. ఈ ఏడాది జనవరి- మార్చి క్వార్టర్, ఏప్రిల్ - జూన్ క్వార్టర్ లు బకాయి కాగా ఇప్పుడు సెప్టెంబరు నెల రాగా మొత్తం 7 క్వార్టర్ లకు సంబంధించిన ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు పెట్టింది. ● 15 నెలల్లో 7 క్వార్టర్లు బకాయిలు పెట్టిన కూటమి ప్రభుత్వం... ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 క్వార్టర్లుగా ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించడం లేదు. 15 నెలలుగా ఇదే పరిస్థితి. వాస్తవాలు కావాలంటే చూసుకోవచ్చు. కూటమి ప్రభుత్వం తీరుతో కాలేజీలు తమ స్టాఫ్ కు జీతాలు చెల్లించడానికి కూడా ఇబ్బంది పడుతున్నాయి. విద్యార్ధులు నుంచి వసూలు చేద్దామంటే కలెక్టర్ల ద్వారా ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో ప్రజలు, విద్యార్ధులు రోడ్డెక్కి కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించారు. దాని మీద పోలీసు కేసులు పెడుతున్నారు. మంత్రి నారా లోకేష్ వీటికి సమాధానం చెప్పాలి? మైక్ ఇచ్చారని కౌన్సిల్ సాక్షిగా ఏదైనా మాట్లాడతానంటే చెల్లదు. ప్రతి కాలేజీ యాజమాన్యానికి, చదువుకుంటున్న విద్యార్ధికి తెలుసు. గతంలో వైయస్.జగన్ హయాంలో విద్యార్ధుల తల్లి అకౌంట్లో డబ్బులు జమ చేస్తే వాళ్లు కాలేజీలకు చెల్లించేవారు. ఈ ప్రభుత్వం తాము నగదు నేరుగా కాలేజీలకు ఇస్తామని జీవో జారీ చేశారు. కానీ అది ఎక్కడా అమలు కాలేదు. శాసనమండలి సాక్షిగా పచ్చి అబద్దాలు చెబుతున్న లోకేష్ ను సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఏడు క్వార్టర్లు బకాయిలకు గానూ.. కూటమి ప్రభుత్వం కేవలం ఒకే ఒక్క క్వార్టర్ మాత్రమే ఫీజులు చెల్లించింది. కాలేజీ అసోసియేషన్ తరపున ప్రభుత్వంతో మాట్లాడాం. ఇది రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్ధుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం. ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అది లేకపోతే రూ.3వేలు నిరుద్యోగ భృతి అన్నారు. అది కూడా లేకుండా పోయింది. చదువుకునే విద్యార్ధులకు గత ప్రభుత్వం వసతి దీవెన కింద రూ.20వేలు ఇచ్చేవాళ్లు. ఇప్పుడు కూటమి పాలనలో దాని గురించి మాట్లాడ్డం లేదు. ఫీజు రీయింబర్స్ మెంట్ పై ఇచ్చిన వాగ్ధానం అమలు చేయమని ప్రశ్నిస్తే కాకమ్మ కధలు చెబుతున్నారు. ● తక్షణమే ఫీజు బకాయిలు చెల్లించాలి. కూటమి ప్రభుత్వం తక్షణమే ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకపోతే... విద్యార్ధులు రోడ్డెక్కి మీ తప్పిదాలను నిలదీయడం ఖాయమని నేదురుమల్లి రామ్ కుమార్ హెచ్చరిచారు. కూటమి తీరు నిండా మునిగాక చలి ఏంటన్నట్టు ఉందని ఆక్షేపించారు. ఫీజు బకాయిలు నెపాన్ని వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం మీద మోపి... కూటమి ప్రభుత్వం మొత్తం పథకాన్నే ఎత్తేసే యోచన చేస్తోందని ఆగ్రహించారు. వాస్తవాలేంటో రాష్ట్ర ప్రజలకు, విద్యార్ధులకు తెలుసని... బకాయిలు చెల్లించకపోతే ఆందోళన తప్పదని హెచ్చరించారు.