నెల్లూరు: కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియకు కసరత్తు ప్రారంభమైన నేపథ్యంలో నెల్లూరు వైయస్ఆర్‌సీపీ సిటీ కార్యాలయంలో డివిజన్ వారీగా కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 16వ డివిజన్‌కు చెందిన నాయకులు, కార్యకర్తలతో సిటీ నియోజకవర్గ ఇన్‌చార్జ్, ఎమ్మెల్సీ పర్వత చంద్రశేఖర్‌రెడ్డి ప్రత్యేకంగా సమావేశమై పార్టీ కార్యక్రమాలపై చర్చించారు. ప్రజా సమస్యలపై వైయస్ఆర్‌సీపీ చేస్తున్న పోరాటాల్లో చురుగ్గా పాల్గొంటున్న కార్యకర్తలను ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి అభినందించారు. అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీ చేస్తున్న పోరాటాలను మరింత విస్తృతం చేయాలని సూచించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎంతమంది ఆశావహులు ఉన్నా పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే అభ్యర్థుల ఎంపిక, సీట్ల కేటాయింపు జరుగుతుందని చంద్రశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు. అభ్యర్థి ఎవరైనా పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ఐక్యంగా పనిచేయాలని, క్షేత్రస్థాయిలో సమన్వయంతో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.