న్యూఢిల్లీ : కోవిడ్ మహమ్మారితో పాటు వర్షాల కారణంగా కాకినాడ-విశాఖపట్నం-శ్రీకాకుళం గ్యాస్ పైప్ లైన్ (కేఎస్‌పీఎల్) నిర్మాణ పనుల్లో జాప్యం జరిగినట్లు పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలి తెలిపారు. రాజ్యసభలో సోమవారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. కాకినాడ-వైజాగ్-శ్రీకాకుళం మధ్య సహజవాయువు పైప్ లైన్ నిర్మాణానికి పెట్రోలియం, నాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు (పీఎన్జీఆర్‌బీ) 2014 జూలై 16న ఆంధ్రప్రదేశ్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్‌ను అనుమతించినట్లు కేంద్రమంత్రి చెప్పారు. కేఎస్‌పీఎల్ పైప్ లైన్ ప్రాజెక్ట్‌లోని కాకినాడ-వైజాగ్ సెక్షన్‌ను 2021 జూన్ 30 నాటికి, వైజాగ్-శ్రీకాకుళం సెక్షన్‌ను 2022 జూన్ 30 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అయితే కోవిడ్ మహమ్మారి విజృంభణ, ఎడతెరిపిలేని వర్షాల కారణంగా పైప్ లైన్ నిర్మాణ పనుల్లో జాప్యం జరిగింది. దీంతో కాకినాడు-వైజాగ్ సెక్షన్ నిర్మాణ గడువును 2022 సెప్టెంబర్ 30, వైజాగ్-కాకినాడ సెక్షన్ గడువును 2023 సెప్టెంబర్ 30 వరకు పొడిగించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పీఎన్‌జీఆర్‌బీని కోరినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు.