తిరుపతి: టీడీపీ కూటమి పాలనలో టీటీడీ ప్రతిష్ట నానాటికీ దిగజారుతోందని, దేవదేవుడి చెంత నిత్యం అపచారాలు కొనసాగుతున్నాయని వైయస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ఆక్షేపించారు. తిరుమలో వేద పారాయణం ఆపాలని చూస్తున్నారన్న ఆయన, ఇది హిందూ సనాతన ధర్మానికి పూర్తి విరుద్ధమని, పురాణాలు, సంప్రదాయాల యథేచ్ఛ ఉల్లంఘన అని స్పష్టం చేశారు. ఈ అంశంపై ఆలయ ఉన్నతాధికారి ఒకరు ఏకపక్షంగా ఆదేశాలు జారీ చేశారని, సీఎం సూచన లేకుండా ఆ స్థాయి నిర్ణయం ఉండే అవకాశం లేదని తిరుపతిలో మీడియాతో మాట్లాడిన భూమన కరుణాకర్‌రెడ్డి తేల్చి చెప్పారు. ప్రెస్‌మీట్‌లో భూమన కరుణాకర్‌రెడ్డి ఏం మాట్లాడారంటే..: వేద పారాయణానికి జగన్‌గారు ప్రాధాన్యం: టీటీడీ ఆధ్వర్యంలో ఆరు వేద పాఠశాలలు కొనసాగుతుండగా, నాడు వేద విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం మహానేత వైయస్సార్ ఎంతో చొరవ చూపారు. వేద పారాయణానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన శ్రీ వైయస్ జగన్, గత ప్రభుత్వ హయాంలో కొత్తగా 700 పోస్టులు మంజూరు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక, వేద పారాయణంపై శీతకన్ను వేసింది. ఇప్పటికీ 27 పోస్టులు ఖాళీగా ఉన్నా, ఎలాంటి నియామకాలు జరపడం లేదు. వేద పారాయణం ఆపడం తగదు: తిరుమల శ్రీవారి ఆలయంలో శతాబ్దాలుగా నిరంతరాయంగా కొనసాగుతున్న వేద పారాయణాన్ని ఆపాలని టీటీడీలో ఒక ఉన్నతాధికారి ఆదేశించారు. వేద పారాయణాన్ని అవహేళన చేస్తూ, అది ఎవరికీ అర్థం కాదని.. అందువల్ల అందుకు బదులుగా ‘ఓం నమో వెంకటేశాయ’ అనాలని ఆ అధికారి వేద పండితులను ఆదేశిస్తున్నాడు. వారసత్వంగానో, వ్యక్తిగత అభిరుచితోనో వేదాలు చదవుతూ శ్రీవారి ఆలయ ప్రాభవాన్ని ఇనుమడింప చేస్తున్న వేద పండితులను అవహేళన చేసేలా ఆ ఉన్నతాధికారి మాట్లాడటం దారుణం. ఇది సనాతన హిందూ ధర్మాన్ని నిట్టనిలువునా గొయ్యి తీసి పూడ్చి పెట్టడమే. వేదం అంటే బ్రహ్మ దేవుని వాక్కు అని అందరూ విశ్వసిస్తారు. సనాతన భారతీయం వేల సంవత్సరాలుగా సమున్నతంగా వెలుగుతోందంటే ఆ వేదాల పుణ్యమేనని పండితులు చెబుతారు. సనాత హిందూ భారతీయ వేద సంస్కృతి కాపాడబడాలి అంటే వేదాలను ఉచ్ఛరించాలి. ఇవన్నీ పక్కన పెట్టి వేద పారాయణాన్ని ఆపేయాలని టీటీడీలో ఒక ఉన్నతాధికారి చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వేద పారాయణం ప్రాశస్త్యం: శ్రీవారి కొలువై ఉన్న గర్భాలయంలో నిత్యం వేద పారాయణం జరుగుతుంది. పూజా విరామ సమయాల్లో, ఉదయం వేళ భక్తులకు దర్శనం అవుతుంటే వేద పారాయణం, స్వామి మహిమ, వేద మహిమలు తెలిపే పురాణ ప్రవచనం అనాదిగా ఆనంద నిలయంలో విమాన వెంకటేశ్వరుని ముందు కొనసాగుతోంది. ఇంకా చెప్పాలంటే నయన మనోహరమైన శుక్రవారం అభిషేకం వేదంలోని పంచోపనిషత్తులు శ్రీ, భూ, నీలా సూక్తులు, శాంతిసూత్రాలు లేకుండా పరిపూర్ణం కాదు. ఇదీ వేదాలకున్న ప్రాశస్త్యం. కలియుగంలో ప్రతిరోజూ తొలిసేవకు శ్రీకారం చుట్టే చతుర్మఖ బ్రహ్మ గుడి తలుపులు తీయగానే నాలుగు వేదాలను పారాయణం చేస్తారు. అందుకే సుప్రభాత తీర్థానికి బ్రహ్మతీర్థం అని పేరు. తిరుమల దాన శాసనాలు చూస్తే.. ఆలయంలో నిత్యం వేద పారాయణం జరగాలని, తద్వారా తిరుమల ప్రాశస్త్యం మరింత పెరుగుతుందని ఎందరో దానాలు సమర్పించారు. వేద పారాయణంలో పదపాఠం, క్రమపాఠం, జఠాపాఠం, గణపాఠం అని వేల సంవత్సరాలుగా ప్రసిద్ధిలో ఉన్నాయి. అంతటి ప్రాశస్త్యం ఉన్న వేద పారాయణానికి ఇప్పుడు తిలోదకాలు ఇవ్వాలని టీటీడీ చూస్తోంది. కేవలం టీటీడీ ఉన్నతాధికారి స్థాయిలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఎంత మాత్రం లేదు. వైయస్సార్‌గారి హయాంలో వేద విశ్వవిద్యాలయం: వేద అధ్యయనాన్ని పెంచాలన్న లక్ష్యంతో తిరుమల కొండపై ధర్మగిరిలో 120 ఏళ్లుగా టీటీడీ శ్రీ వెంకటేశ్వర వేద పాఠశాల నిర్వహిస్తోంది. «కీసరగుట్ట (హైదరాబాద్), నల్లగొండ, కోటప్పకొండ, ఐ.భీమవరం, విజయనగరంలో కూడా టీటీడీ ఆ«ధ్వర్యంలో వేద పాఠశాలలు కొనసాగుతున్నాయి. నాడు వైయస్సార్ సీఎంగా ఉన్నప్పుడు వేద విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆయన తనయుడు శ్రీ వైయస్ జగన్, వేద పారాయణానికి ప్రాధాన్యం ఇస్తూ, 700 పోస్టులు మంజూరు చేశారు. వాటి నియామకం జరిగేలోగా ప్రభుత్వం మారడంతో, కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అప్పటికే ఉన్న 56 పోస్టుల్లో చాలా మంది పదవీ విరమణ చేసినా కొత్తవారిని నియమించడం లేదు. దీంతో దాదాపు 27 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్చకుల తనిఖీ దారుణం: తరతరాలుగా స్వామివారి సేవల్లో ఉన్న నాలుగు కుటుంబాల అర్చకులను తనిఖీల పేరుతో అవమానించడం దారుణం. ఎయిర్‌పోర్టులో తనిఖీ చేసినట్టుగా పోలీసు సిబ్బందితో ఒళ్లంతా తడిమి తనిఖీలు చేయడం సమంజసమేనా? ఇది అర్చకుల కుటుంబాలను తీవ్రంగా అవమానించడమే. ఇదేనా సాంప్రదాయాలను, ఆచారాలను కాపాడటం? ఇదేనా ఆ కుటుంబాలకు తిరుమల తిరుపతి దేవస్ధానం ఇచ్చే మర్యాద? అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. అపచారాల వల్ల కలిగే కర్మఫలం బలీయమైనదని, అది నాశనం చేస్తుందని గుర్తుంచుకోండి. 13 పీఠాలకు నోటీసులు: కొండ మీద ఉన్న ఆశ్రమాల్లో అవకతవకులు చోటు చేసుకుంటున్నాయంటూ 13 పీఠాలకు నోటీసులిచ్చారు. ఎక్కువ స్థలం ఆక్రమించారని టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ ద్వారా ఈ ఉన్నతాధికారే నోటీసులు పంపించారు. లిఖిత పూర్వకంగా తాఖీదులు పంపించి నిరంతరం హోమం, అన్నదానం జరుగుతున్నప్పుడు మీరెందుకు పొయ్యి వెలిగించడం అని వారిని అవమానించారు. అక్కడెందుకు అన్న ప్రసాదం చేస్తున్నారంటూ ఆపేయమని ఆదేశించారు. దానికి ఏం చేయాలో పాలుపోని పీఠాధిపతులు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌కు మొర పెట్టుకున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం కలుగ జేసుకుని రాష్ట్రానికి మొట్టికాయలు వేస్తే మొన్న జరిగిన పాలకమండలి సమావేశంలో ఇక మీదట పీఠాలకు నోటీసులు ఇవ్వకూడదని తీర్మానం చేశారు. పబ్లిసిటీ కోసం భక్తులను ఆపేస్తున్నారు: ఏఐ టెక్నాలజీ సహకారంతో వచ్చిన భక్తులందరికీ గంటలో దర్శనం చేయిస్తామని టీటీడీ ఛైర్మన్ చెప్పినట్లు టీడీపీ అనుకూల మీడియాలో గొప్పగా రాశారు. కానీ భక్తులు మాత్రం గంటల కొద్దీ క్యూ లైన్లలో చంటి పిల్లలతో నిరీక్షించలేక అల్లాడిపోతున్నారు. వారం పది రోజులుగా రాత్రి 8 గం. తర్వాత విజిలెన్స్ వారు ఎంబీసీ క్వార్టర్స్, కళ్యాణకట్ట దగ్గర నుంచి వచ్చే దారిలో, వరాహస్వామి ఆలయం దగ్గర, మరో రెండు చోట్ల తాళ్లు కట్టి చిన్న చిన్న మైకుల్లో దర్శనానికి వెళ్లొద్దంటూ ప్రచారం చేస్తున్నారు. క్యూ కాంప్లెక్సుల్లో ఉన్న భక్తులందరికీ శీఘ్ర దర్శనం కల్పించినట్టు ప్రచారం చేసుకోవడం కోసం దర్శనం కోసం నిరీక్షిస్తున్న భక్తులను రాకుండా ఎక్కడికక్కడ ఆపేస్తున్నారు. శ్రీవారి దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచో వ్యయ ప్రయాసలకోర్చి వచ్చిన భక్తులను బెదిరించి ఆపడం సమంజసమేనా? అని భూమన కరుణాకర్‌రెడ్డి ప్రశ్నించారు.