తిరుపతి : శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి 16వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రచార విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వి. హరిప్రసాద్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. “జోహార్ వైయస్సార్... జోహార్ వైయస్ఆర్ ... సాధిద్దాం సాధిద్దాం... వైయస్ఆర్ ఆశయాలు సాధిద్దాం” అంటూ ప్రతిధ్వనించిన నినాదాలతో కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రచార విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వి. హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ – “ప్రజా సంక్షేమం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన నాయకుడు వైయస్సార్. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చి వ్యవసాయాన్ని రక్షించిన నాయకుడు ఆయనే. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేసి వేలాది పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందేలా చేశారు. పేదల ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చి కోట్లాది మంది బతుకులను కాపాడారు. గృహ నిర్మాణ పథకాల ద్వారా నిరుపేదలకు తలదాచుకునే ఇల్లు కల్పించారు. జలయజ్ఞంతో రాయలసీమ సహా రాష్ట్రమంతా చెరువులు, ప్రాజెక్టులను పునరుద్ధరించి నీటి కొరత సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు. ఇవన్నీ వైయస్ఆర్ అనే మహానేతను ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిపాయి” అని అన్నారు. “రాజకీయాల్లో నాయకులు చాలామంది ఉంటారు, కానీ ప్రజల కోసం బతికే నాయకుడు, ప్రజల కోసం మిగిలే నాయకుడు ఒక్కరే... ఆయన వైయస్ రాజశేఖర రెడ్డి. ఆయన చూపిన మార్గం, ఆయన కలలు నేటి తరానికి స్ఫూర్తి. విద్యార్థులు, యువత ఆయన ఆశయాలను అనుసరించి ముందుకు సాగాలి” అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ విద్యార్థులు, అధ్యాపకులు, స్థానిక ప్రజలు, వైయస్ఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహానేత సేవలను స్మరించుకున్నారు.