ఉప్పాల హారికపై దాడి చేసిన టీడీపీ గూండాలను అరెస్ట్ చేయాలి

మహిళా కమిషన్ దీనిని సుమోటోగా స్వీకరించాలి

సీఎం చంద్రబాబు ఈ ఘటనకు క్షమాపణ చెప్పాలి

వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్య‌క్షురాలు వ‌రుదు క‌ళ్యాణి డిమాండ్

కృష్ణాజిల్లా జెడ్పీ చైర్‌పర్సన్, బీసీ నేత ఉప్పాల హారికపై టీడీపీ గూండాలు చేసిన దాడికి నిరసనగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన.

కళాక్షేత్రం వద్ద మహాత్మా జ్యోతీరావుపూలే విగ్రహానికి పూలమమాలు వేసి నివాళి.

రాష్ట్రంలో బీసీ మహిళా ప్రజాప్రతినిధికే రక్షణ లేని స్థితిలో పాలన సాగిస్తున్న ఈ ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకు మంచి బుద్ది ప్రసాదించాలని కోరుతూ మహాత్మా జ్యోతిరావు పూలేకు వినపతిపత్రం సమర్పించిన మహిళా నేతలు

విజయవాడ: కృష్ణా జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్, బీసీ నేత ఉప్పాల హారికపై తెలుగుదేశం పార్టీ గూండాల దాడికి నిరసనగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళా నేతలు ఆందోళన నిర్వహించారు. రాష్ట్రంలో బడుగు, బలహీనవర్గాలపై జరుగుతున్న దాడులు, అరాచక పాలన నుంచి విముక్తి ప్రసాదించాలని, సీఎం చంద్రబాబుకు మంచి బుద్దిని ఇవ్వాలని కోరతూ మహాత్మా జ్యోతిరావు విగ్రహానికి పూలమాలలు వేసి, వినతిపత్రం సమర్పించారు. అనంతరం మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉప్పాల హారికపై దాడి చేసిన నిందితులను తక్షణం అరెస్ట్ చేయాలని, ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం చంద్రబాబు బీసీలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎవరెవరు ఏం మాట్లాడారంటే...

రెడ్‌బుక్ రాజ్యాంగంతో మహిళలపై దాడులు
:   వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి

రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగంతో ప్రభుత్వం మహిళల ఉసురు పోసుకుంటోంది. కృష్ణాజిల్లా జెడ్పీ చైర్‌పర్సన్, బీసీ నాయకురాలు ఉప్పాల హారికపై తెలుగుదేశం గూండాలు పట్టపగలు, నడిరోడ్డుపై గంటపాటు కర్రలు, రాళ్ళతో దాడి చేస్తుంటే ఈ ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తోంది.? సోషల్ మీడియాలో వస్తున్న వీడియోల్లో చాలా స్పష్టంగా కనిపిస్తున్న దృశ్యాల్లో దుండగులను వారించకుండా, పోలీసులు మౌనంగా నిలుచుని వీక్షిస్తున్నారంటే దానిని ఎలా అర్థం చేసుకోవాలి.? సీఎం చంద్రబాబు, లోకేష్‌ల ప్రోత్సాహంతోనే టీడీపీ గుండాలు ఈ దాడికి పాల్పడ్డారు. అందుకే మూడు రోజులైనా ఆ గూండాలపై పోలీసులు కేసులు పెట్టి, అరెస్ట్ చేయకుండా వారికి అండగా నిలుస్తున్నారు. రాష్ట్రంలో మహిళా హక్కులను కాపాడటానికే ఉన్న మహిళా కమిషన్ చైర్‌పర్సన్ ఈ ఘటనపై ఎందుకు మౌనంగా ఉన్నారు. మొత్తం మీడియాలోనే అత్యంత దారుణమైన ఘటనగా మూడు రోజులుగా ప్రసారం అవుతున్నా కూడా మహిళా కమిషన్ మౌనంగా ఉండటం దారుణం. కేవలం తెలుగుదేశం వారిపై జరిగే అన్యాయాలపైనే స్పందించడానికి మహిళా కమిషన్ ఉందా.? ఇదే విధంగా వ్యవహరిస్తే రాష్ట్ర మహిళా కమిషన్‌ను తెలుగుదేశం మహిళా విభాగంగానే ప్రజలు గుర్తించాల్సిన పరిస్థితి వస్తుంది. తక్షణం ఉప్పాల హారికపై జరిగిన దాడికి సంబంధించి మహిళా కమిషన్ సూమోటోగా తీసుకుని, ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వాలి. ప్రేక్షకపాత్ర పోషిస్తూ, దుండగులకు ప్రోత్సాహాన్ని అందించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. చంద్రబాబు పాలనలో, కూటమి ప్రభుత్వంలో బీసీలకు భద్రతలేదు. రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కును కూడా రెడ్‌బుక్ రాజ్యాంగం అమలుతో హరించి వేస్తున్నారు. అందుకే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబుకు, ఈ ప్రభుత్వానికి మంచి బుద్దిని ప్రసాదించాలని కోరుతూ ఈ రోజు మహాత్మా జ్యోతిరావు పూలేకు వినతిపత్రం సమర్పించాం. ఆ మహానీయులు తమ జీవితాంతం ఏ మహిళల అభ్యున్నతి కోసం, బీసీల ఆత్మగౌరవం కోసం పాటు పడ్డారో, వారి ఆశయాలకు విరుద్దంగా నేడు చంద్రబాబు పాలన సాగుతోందని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆవేదన వ్యక్తం చేశారు. 
 
మహిళలపై దాడులు జరుగుతుంటే సీఎంకు పట్టదా?
:  ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి

కృష్ణాజిల్లా జెడ్పీ చైర్‌పర్సన్, బీసీ నాయకురాలు ఉప్పాల హారికపై టీడీపీ గూండాలు పాశవికంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన జరిగి రోజులు గుడుస్తున్నా దుండగులపై కేసులు నమోదు చేయకుండా ప్రభుత్వం కొమ్ము కాస్తోంది. పైగా బాధితులపైనే ఎదురు కేసులు నమోదు చేయడం చూస్తుంటే, ఇంత కంటే అరాచక పాలన ఎక్కడైనా ఉంటుందా అనే సందేహం కలుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుస్తోందా? ఈ రాష్ట్రంలో మహిళల మీద ఎవరైనా చేయి వేస్తే, వారికి అదే చివరిరోజు అని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా బుల్లెట్ కన్నా వేగంగా స్పందిస్తానని బీరాలు పలికారు. మహిళా హోమంత్రి వి.అనిత మాట్లాడుతూ మహిళలపై దాడి చేసిన వారు మా కార్యకర్తలు అయినా సరే వెంటనే వారిపై చర్య తీసుకుంటామని అన్నారు. కృష్ణాజిల్లాలో ఒక బీసీ మంత్రి ఉండి, బీసీ సామాజిక వర్గంకు చెందిన మహిళా నేతపై దాడి జరిగితే, తమ పార్టీ వారే నిందితులుగా ఉన్నారని దానిపై కనీసం స్పందించక పోవడం దారుణం. పైగా ఉప్పాల హారికను మహానటి అంటూ అవాకులు, చెవాకులు మాట్లాడటంను తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణం ఉప్పాల హారికపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలి. రాష్ట్రంలో మహిళలపై మరోసారి ఇటువంటి దాడులు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి అన్నారు.  

రాష్ట్రంలో అరాచక పాలన
:  విజయవాడ మేయర్, రాయని భాగ్యలక్ష్మి

బీసీ నాయకురాలు, కృష్ణాజిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌పై జరిగిన దాడి మొత్తం మహిళా లోకంపై జరిగిన దాడి. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది. మహిళలకు కనీస భద్రత లేకుండా పోయింది. ఉప్పాల హారికపై దాడి జరిగి మూడు రోజులు గడుస్తున్నా, నేటికీ నిందితులను అరెస్ట్ చేయకుండా ప్రభుత్వం కొమ్ముకాస్తోంది. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. రాష్ట్రంలో అసమర్థ పాలనపై ప్రశ్నించిన ప్రతి గొంతునూ నొక్కేందుకు ప్రభుత్వమే ప్రయత్నిస్తోంది. సోషల్ యాక్టివీస్ట్‌లు, సాక్షి పత్రిక, ప్రజాస్వామికవాదులను అణిచివేయాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కనీసం రక్షణ లేని పరిస్థితిని చూస్తున్నామని మేయర్ రాయని భాగ్యలక్ష్మి అన్నారు. 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ నగర డిప్యూటీ మేయర్లు అవుతు శైలజారెడ్డి, బెల్లం దుర్గ, కృష్ణాజిల్లా, విజయవాడ జిల్లా మహిళా విభాగం అధ్యక్షులు విజిత, భారతి తదితరులు.

Back to Top