తాడేపల్లి: కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 20 నెలల కాలంలో సంక్షేమ హాస్టళ్లలో జరిగిన 18 దారుణ ఘటనల్లో పలువురు విద్యార్థులు మరణించగా, వేల మంది విద్యార్థులు అస్వస్థతతో ఆస్పత్రుల పాలయ్యారని ఇవన్నీ విద్యార్థుల పట్ల చంద్రబాబు క్రూర మనస్తత్వానికి నిదర్శనమని వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు స్పష్టం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఏదీ అమలు చేయకుండా పచ్చి అబద్ధాలు, మోసాలతో 20 నెలలుగా చంద్రబాబు పాలన సాగిస్తున్నాడని మండిపడ్డారు. అయినా సెక్రటరీల సమావేశంలో మాత్రం ప్రజల జీవన ప్రమాణాలు పెంచేశానని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని అభిప్రాయపడ్డారు. ఆయన చెప్పేదే నిజమైతే కూటమి ప్రభుత్వం వచ్చాక రెండింతలైన విద్యుత్ చార్జీలు, పెరిగిన బస్ చార్జీలు, ఆకాశాన్నంటిన నిత్యవసర వస్తువుల ధరలకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. ఐదేళ్లుగా పోరాడి నాటి సీఎం వైయస్ జగన్ విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ కాకుండా కాపాడితే చంద్రబాబు సీఎం అయ్యాక ముక్కలుగా చేసి ప్రైవేటీకరిస్తూ ఉద్యోగులు, కార్మికుల జీవితాలను రోడ్డున పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు దమ్ముంటే విశాఖ స్టీల్‌ప్లాంట్ ని ప్రైవేటీకరించకుండా ప్రధానితో ప్రకటన చేయించాలని డిమాండ్ టీజేఆర్ సుధాకర్ బాబు డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో జరుగుతున్న దారుణాలకు సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యత వహించాలన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... విద్యా శాఖని నిర్వహించలేని లోకేష్ ఎలాంటి బాధ్యత లేని కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా పోలవరం జిల్లా మారేడుపల్లి మండలం దేవరపల్లి గిరిజన సంక్షేమ బాలుర హాస్టల్‌లో 89 మంది బాలురు అస్వస్థతకు గురయ్యారు. జూన్ 11, 2024లో చంద్రబాబు సీఎం అయిన నాటి నుంచి రాష్ట్రంలో జరిగిన 18 ఘటనలు విద్యార్థుల పట్ల ప్రభుత్వం అవలంభిస్తున్న క్రూరమైన వైఖరికి నిదర్శనం. ఉడికీ ఉండకని ఇడ్లీ, నిల్వ ఉంచి చెట్నీ తినడం వల్ల 89 మంది ఆస్పత్రి పాలయ్యారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సుధారాణి ఈ దారుణ ఘటనలకు బాధ్యత వహించాలి. తనకు సంబంధం లేని శాఖల్లో వేలపెట్టి హడావుడి ప్రదర్శించే లోకేష్.. తాను ప్రాతినిథ్యం వహించే విద్యాశాఖనే సరిగా నిర్వహించలేకపోతున్నాడు. ● నాణ్యమైన మధ్యాహ్న భోజనానికే దిక్కులేదు వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు గోరుముద్ద పేరుతో పౌష్టికాహారంతో కూడిన నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తే, కూటమి ప్రభుత్వం దాన్ని ఘోర ముద్దగా మార్చేసి చిన్నారుల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారు. వారం రోజులపాటు ఏడు రకాల ఆహారపదార్థాలతో కూడిన మెనూను తయారు చేసి నాణ్యమైన భోజనం అందించడం జరిగింది. గురుకుల సంక్షేమ పాఠశాలల్లో ఉంటూ చదువుకునే విద్యార్థుల సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేశారు. వసతి గృహాల్లో ఉంటూ చదువుకునే విద్యార్థుల సంక్షేమం, వసతి, ఆరోగ్యం కోసం వైయస్ఆర్‌సీపీ హయాంలో ఐదేళ్లలో 40 లక్షల 50 వేల మంది విద్యార్థులకు రూ. 7,245 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. అంటే, సరాసరిన ఏడాదికి రూ.1400కోట్లకు పైగా ఖర్చు చేస్తే, అదే చంద్రబాబు గత పాలనలో 2014-19 మధ్య ఐదేళ్లలో చేసిన ఖర్చు కేవలం రూ. 450 కోట్లు మాత్రమే. కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యాలయాల పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే హోంమంత్రి తినే భోజనంలోనే బొద్దింక కనిపించింది. పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటే సెక్రటరీల సమావేశంలో సీఎం చంద్రబాబు మాత్రం 20 నెలల్లోనే ప్రజల జీవన ప్రమాణాలు పెంచేశానని సిగ్గులేకుండా గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఈ 20 నెలల చంద్రబాబు పాలనలో నిత్యవసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. విద్యుత్ చార్జీలు రెండింతలయ్యాయి. బస్ చార్జీలతో ఇతర సేవలన్నీ ప్రియమైపోయాయి. కూటమి 20 నెలల పాలన గురించి బీజేపీ నాయకులే బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దళితులు, మైనారిటీలు, బీసీలపై కక్ష పెంచుకుని హింసిస్తున్న చంద్రబాబు.. అన్ని వర్గాలకు సముచితమైన న్యాయం చేస్తున్నానని చెప్పడం హాస్యాస్పదం. వైయస్ జగన్ తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశారు. కులం, మతం, ప్రాంతం, పార్టీలతో సంబంధం లేకుండా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అందించి ఆదర్శవంతమైన పాలన అందించారు. కానీ చంద్రబాబు చెప్పిన సూపర్ సిక్స్ పెద్ద మోసంగా మిగిలిపోయింది. ● అప్పులు తప్ప అభివృద్ధి కనిపించడం లేదు 20 నెలల చంద్రబాబు పాలనలో అప్పులు తప్ప ఎక్కడా అభివృద్ధి ఆనవాళ్లు కనిపించడం లేదు. వైయస్ఆర్‌సీపీ హయాంలో ప్రైవేటుపరం కాకుండా అడ్డుపడిన విశాఖ స్టీల్ ప్లాంట్‌ను చంద్రబాబు సీఎం అయిన 20 నెలల్లోనే కేంద్రంతో కలిసి ముక్కలుగా చేసి ప్రైవేటీకరిస్తున్నాడు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అంగీకరించే ప్రసక్తే లేదని మోడీని నిలదీసే దమ్ము చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్‌లకు లేదు. వైయస్ఆర్‌సీపీహయాంలో వచ్చిన పరిశ్రమలకు శంకుస్థాపనలు చేయడం మినహా కొత్తగా తెచ్చిన పరిశ్రమలే లేవు. ఎప్పటికి పూర్తవుతుందో కూడా తెలియని అమరావతి రాజధాని పేరుతో ఇప్పటికీ ప్రజలను మభ్యపెడుతున్నాడు. రైతుల నుంచి భూములు సేకరించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. కనీసం అమరావతి రాజధానికి నేషనల్ హైవే నుంచి కనెక్టివిటీ కూడా లేదు. కానీ ఇప్పటికే రూ. 76వేల కోట్లు ఖర్చు చేసినట్టు చంద్రబాబు చెబుతున్నాడు. భూములిచ్చిన రైతులకు ప్లాట్లు ఇప్పటికీ ఇవ్వలేదు. రైతులు పండించిన పంటలకు కనీసం గిట్టుబాటు ధరలే ఇవ్వలేని చంద్రబాబు ఏఐ టెక్నాలజీ పేరుతో అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. 23 లక్షల ఉద్యోగాలిచ్చానని చెబుతున్న చంద్రబాబు.. వాటి లెక్కలు చెప్పాలి. చట్టాలను మార్చాలని చంద్రబాబు చెప్పడం కాదు.. ఈ చంద్రబాబునే మార్చాలని సుధాకర్ బాబు డిమాండ్ చేశారు.