ఇదేం చిత్రం బుగ్గలు నొక్కుకుంటోంది దేవేరి. “చిత్రమే కలియుగ చిత్రం” స్వామి చిరునవ్వుతో ఆ తాఖీదు వంక చూస్తూ అన్నాడు. “ఎంత కలియుగమైతే కొండలరాయుడికే తాఖీదా?” దేవేరిలో ఆశ్చర్యం, కోపం మిళితంగా ధ్వనిస్తున్నాయి. “నాకే కాదు ఆ ఏటిగట్టు స్వామికీ, ఆ విశాఖాచలపతి స్వామికి, బెజ్జంవాడ దేవేరికీ కూడా అందాయట ఈ తాఖీదులు..” స్వామిది చిద్విలాస సమాధానం. ‘నారాయణ నారాయణ’ అప్పుడే అందేసినట్టుంది సమాచారం మునీంద్రుడు సోషల్ మీడియా అంత ఫాస్టుగా విషయం తెలుసుకునేందుకు వచ్చేసాడు. “ఏమిటి స్వామీ ఈ వైపరీత్యం” చేతిలో చిడతలను ఛంగున వాయిస్తూ స్వామిని అడిగాడు. ‘లోకంతీరు మునీంద్రా…సర్వలోక సంచారివి నీకామాత్రం తెలీదా కలియుగపు పోకడ’ స్వామి ఎదురు ప్రశ్నించారు. “సకలలోక పాలకుడైన మీకే తాఖీదు పంపారంటే ఆ పాలకులకు …” అంటున్న మునీంద్రుడి మాటలకు మధ్యలోనే అడ్డుతగిలింది దేవేరి. “కండకావరం..” అంటూ. (“కాదు కూటమి కావరం” అన్నాడు మునీంద్రుడు. ) “తాఖీదు సంగతి తెలుసు కానీ అందులో ఉన్న మోతాదు ఏమిటో తెలియదు స్వామీ అది కనుక్కుందామనే వచ్చాను” అన్నాడు కొనసాగింపుగా. “అదీ సంగతీ..చాటింపు వేయాలిగా..వివరాల కోసం వచ్చావు” అన్నారు స్వామి. “స్వామీ మీరు మరీను..నేను చాటింపులు, ఛాటింగులు చేసేదాకా ఆగుతుందా? అన్ని మాధ్యమాల్లో ఈపాటికే ప్రచారం, చర్చలు, థంబు నెయిల్స్ వచ్చేస్తేను. కాకపోతే అందులో వాస్తవం ఆవగింజంత ఉంటే ఊహాజనిత విశ్లేషణ గుమ్మడికాయంత ఉంటుంది. అందుకే నేరుగా మీదగ్గరికే వచ్చాను” వివరణ ఇచ్చుకున్నారు మునీంద్రుడు. “నువ్వే చూడు” అంటూ తాఖీదు ప్రతిని మునీంద్రుడి చేతికి అందించారు స్వామి. మునీంద్రుడు బిగ్గరగా చదవ మొదలు పెట్టాడు. కొండలపై కూర్చుని ఉన్న స్వామి వారికి, పొత్తు ప్రభుత్వం జారీ చేస్తున్న తాఖీదు.. మేము పంపిన భక్తులకు మాత్రమే మీరు వరాలు ఇవ్వాలి తప్ప పూజ చేసిన ప్రతి ఒక్కరికీ దీవెనలు ఇవ్వరాదు. అందులోనూ మా VIP భక్తులకు 1+1 ఆఫర్లో వరాలు ఇచ్చి తీరాలి. స్పెషల్ భక్తుల కోరికలను ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో తీర్చాల్సి ఉంటుంది. ఉచిత దర్శనం భక్తులకు ప్రసాదం ఇవ్వడం, హుండీలో కానుకలు వేసే అవకాశం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. మా ప్రత్యర్థులు చేసే పూజలు, యాగాలు, క్రతువులు ఫలిస్తే అది మీ నేరంగా పరిగణించాల్సి వస్తుంది. మా పొత్తు ప్రభుత్వం అనుమతి లేనిదే మీ నుంచి దీవెనలు కానీ, ఆశీస్సులు కానీ, అక్షింతలు కానీ, తీర్థ ప్రసాదాలు కానీ, శఠగోపం కానీ ఇతరులకు చేరడం ఇకపై నిషిద్ధం. కాదని ఇస్తే షోకాజ్ నోటీసు ఇవ్వడంతో పాటు వివరణ కోరడం జరుగుతుంది. వివరణ సంతృప్తికరంగా లేని పక్షంలో విచారణ చేసి, తగిన చర్యలు తీసుకోబడతాయి. ఈ నిబంధనలన్నీ నేటి నుంచి అమలులోకి వస్తాయి. కొండపై కూర్చున్న స్వామితో సహా సకల స్వాములకు, దేవేరులకు ఈ తాఖీదు వర్తిస్తుందని తెలియజేస్తున్నాం. ఇట్లు తొత్తు అధికారి, పొత్తు ప్రభుత్వం “అయితే స్వామీ ఎవరికి వరం ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదో ఎలా తెలిసేది? దాని గురించి ఈ చెత్త ప్రభుత్వం మన్నించాలి పొత్తు ప్రభుత్వం చెప్పనేలేదే” తాఖీదు చదవడం పూర్తి చేసాక సందేహం వెలిబుచ్చాడు మునీంద్రుడు. “దానిదేముంది..సులువుగా తెలిసిపోతుందిలే..మునీంద్రా…అర్చకులు ఎవరికి వేదాశీర్వచనం ఇచ్చాక నోటీసులు రావో వారికి మనం ఆశీర్వచనం నిరభ్యంతరంగా ఇచ్చేయొచ్చు. అదే ఎవరికి వేదాశీర్వచనం ఇచ్చాక నోటీసులు వస్తాయో వాళ్లను వదిలేయడమే” “అర్చకులకు నోటీసులా? ఇదెక్కడి అపచారం స్వామీ” వాపోయాడు మునీంద్రుడు “అది భక్తుల గ్రహచారం” అంది దేవేరి జాలిగా. “అయితే అయినవారికి ఆకులు కానివారికి కష్టాలూ కారాగారాలా స్వామీ” అన్నాడు మునీంద్రుడు. మునీంద్రుడి స్వరంలో నిష్టూరం స్వామికి అర్థమైంది. “తాఖీదులిచ్చే తలరాతను రాసింది నేనేగా.. ఆ తలరాతను మార్చేది కూడా నా తాఖీదేగా మునీంద్రా” అన్నారు స్వామి జగన్మోహనంగా నవ్వుతూ.. “తథాస్తు” అంది దేవేరి అభయముద్ర ఇస్తూ.