ఈ ఒప్పందం ఉన్నత విద్యలో గేమ్‌ ఛేంజర్‌గా నిలుస్తుంది

ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి

ప్ర‌ఖ్యాత మాసివ్‌ ఓపెన్ ఆన్‌లైన్‌ కోర్సులు కంపెనీ ఎడెక్స్‌తో రాష్ట్ర‌ ప్రభుత్వం ఎంవోయూ

తాడేప‌ల్లి: ఉన్నతవిద్యలో ప్రపంచస్థాయి అత్యుత్తమ యూనివర్సిటీల సర్టిఫికెట్‌ కోర్సులను వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఉచితంగా అందించబోతోంది. ప్రఖ్యాత మాసివ్‌ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సులు కంపెనీ (MOOC) ఎడెక్స్‌తో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌తో ఎడెక్స్ వ్య‌వ‌స్థాప‌కుడు, సీఈవో, ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత అనంత్ అగ‌ర్వాల్ స‌మావేశ‌మ‌య్యారు. అనంత‌రం ఒప్పందంపై అనంత్‌ అగర్వాల్‌, ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జె.శ్యామలరావు సంత‌కాలు చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా హార్వర్డ్‌, ఎంఐటీ, ఆక్స్‌ఫర్డ్‌, క్రేంబ్రిడ్జి సహా పలు ప్రపంచ అత్యుత్తమ వర్శిటీల నుంచి సంయుక్త సర్టిఫికెట్లను విద్యార్థులకు అందిస్తారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్  హేమచంద్రారెడ్డి, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్‌, ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి జె శ్యామలరావు, ఎడెక్స్ ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.

ఈ సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడుతూ.. ఉన్నత విద్యలో ఈ ఒప్పందం గేమ్‌ ఛేంజర్‌గా నిలుస్తుందని ఆకాంక్షించారు. నిరుపేద విద్యార్థులకు ఈ ఒప్పందం కారణంగా మరింత మేలు జరుగుతుందని, ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థికి ప్రపంచప్రఖ్యాత యూనివర్శిటీల కోర్సులను నేర్చుకునే అవకాశం ఉంటుంద‌న్నారు. కోర్సులు చేసిన విద్యార్థులకు హార్వర్డ్‌, ఎంఐటీ, క్రేంబ్రిడ్జి, ఆక్స్‌ఫర్డ్‌ లాంటి యూనివర్శిటీలతో ఎడెక్స్‌ సంయుక్త సర్టిఫికేషన్‌ విద్యార్థులకు లభిస్తుంద‌ని చెప్పారు. శాస్త్ర, సాంకేతిక, సామాజిక , సాంఘిక శాస్త్రాలకు సంబంధించిన వివిధ రకాల సబ్జెక్టులు, ఈ ఒప్పందం ద్వారా అందుబాటులోకి వస్తాయ‌ని, మన దేశంలో లభ్యంకాని ఎన్నోకోర్సులను కూడా నేర్చుకునే అవకాశం వస్తుంద‌న్నారు. ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ లాంటి కోర్సులే కాదు, ఆర్ట్స్‌, కామర్స్‌లో పలురకాల సబ్జెక్టులకు చెందిన కోర్సులు.. ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయ‌ని, అంతిమంగా మంచి ఉపాధి, ఉద్యోగావకాశాలు రాష్ట్ర విద్యార్థులకు దక్కాలి అని సీఎం వైయ‌స్‌ జగన్ అన్నారు. ఆకాంక్షించారు.

Back to Top