జయహో బీసీ సభ అనగానే.. టీడీపీలో వణుకు

రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు 

 బీసీలే టీడీపీకి సమాధి కడతారు.

 బీసీలకు ఏం చేశామనేది ధైర్యంగా మేం చెప్పుకోగలం

 కానీ మీకు ఆ ధైర్యం ఉందా? చెప్పుకోగలరా?

 సూటిగా ప్రశ్నించిన మంత్రి కారుమూరి

 బీసీలకు బాబు వెన్నుపోటు పొడిచాడు

 బీసీల గురించి మాట్లాడే అర్హత టీడీపీ నేతలకు లేదు

పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి ఫైర్‌

 అయ్యన్నపాత్రుడు ఒక రోగ్‌

 బీసీలను చంద్రబాబు ఓటింగ్‌ యంత్రాలుగానే చూశారు

 ఒక్క బీసీకి కూడా బాబు రాజ్యసభ పదవి ఇవ్వలేదు

 అదే వైయస్ జగన్‌గారు 4గురు బీసీలను రాజ్యసభకు పంపించారు

 గుర్తు చేసిన మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

 బీసీలకు డీబీటీ ద్వారా దాదాపు రూ.86 వేల కోట్లు
 
ఒక్క నిరుపేదకూ ఇంటి స్థలం ఇవ్వని చంద్రబాబు

 అదే వైయస్ జగన్ గారు 31 లక్షల ఇళ్లపట్టాలు ఇచ్చి ఇళ్ళు నిర్మిస్తున్నారు

 తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జయహో బీసీ సభ అనగానే.. టీడీపీలో వణుకు మొద‌లైంద‌ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. ఈ మూడున్నర ఏళ్లలోనే బీసీల్లో ఎంతో పేరు సంపాదించిన వైయ‌స్ జగన్ గారిని చూసి టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నార‌న్నారు. దాంతో ప్రెస్ మీట్లు పెట్టి ఏదేదో మాట్లాడుతున్నారు. చివరకు చంద్రబాబుకు చిన్న మెదడు కూడా చిట్లిపోయి, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. సెల్‌ఫోన్‌ తానే కనిపెట్టానని, ఐటీని తానే తీసుకువచ్చానని చెప్పుకుంటున్నారు. ఇక ఇక్కడ బీసీ నాయకులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అయ్యన్నపాత్రుడు, బుద్ధా వెంకన్న, కళా వెంకట్రావు.. తదితరులంతా చంద్రబాబు హయాంలో బీసీలకు ఏ ఒక్క మేలూ చేయకపోయినా,  బీసీల గురించి పాడిందే పాట పాడుతున్నారు. చంద్రబాబుతో సహా వీళ్ళంతా కూడా..  ఎన్టీఆర్‌ ఆనాడు బీసీలకు ఎంతో చేశారని చెబుతున్నారే తప్ప, తమ పాలనలో బీసీలకు ఏం చేశామన్నది చెప్పలేక పోతున్నారు. అంటే దానర్థం బీసీలకు చంద్రబాబు చేసింది ఏమీ లేదనే కదా. ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచినట్లుగానే, బీసీలకు కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడ‌ని మండిప‌డ్డారు. మంగ‌ళ‌వారం వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు.

     

ప్రతి ఇంట్లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ గారు:
    అదే సీఎం శ్రీ వైయస్‌ జగన్, ఎంతో గొప్ప మనసుతో ప్రతి ఒక్కరికి మేలు చేస్తున్నారు. అర్హతే ప్రాతిపదికగా ప్రభుత్వ పథకాలు అందిస్తున్నారు. ఎక్కడా వివక్షకు, అవినీతికి తావు లేకుండా పథకాలు అమలు చేస్తున్నారు. బీసీలకు వివిధ పథకాల ద్వారా  దాదాపు రూ.86 వేల కోట్లు డీబీటీ ద్వారా అందజేశారు. అనేక పథకాల ద్వారా ప్రతి ఇంట్లో సీఎం శ్రీ వైయస్‌ జగన్, ఒక మామలా, మనవడిలా, అన్నగా, తమ్ముడిలా నిల్చిపోతున్నారు.

అయ్యన్న ఒక రోగ్‌:
    ప్రతి కుటుంబంతో జగన్‌గారికి విడదీయరాని బంధం ఏర్పడడంతో టీడీపీ నాయకులు అసూయతో మాట్లాడుతున్నారు. నిత్యం గంజాయి మత్తులో ఉండే, అయ్యన్నపాత్రుడు నోటి దురదతో ఒక రోగ్‌లా మాట్లాడుతున్నాడు. ఎప్పుడూ బయటకు రాని భారతమ్మ గారి గురించి కూడా ఆయన మాట్లాడుతున్నాడు. మరోవైపు చంద్రబాబు కూడా గతి తప్పి మాట్లాడుతున్నాడు. అందుకే ఆయన తనకు ఇవే చివరి ఎన్నికలని కూడా చెబుతున్నాడు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు, ఆయన పార్టీకి ప్రజలు సమాధి కట్టబోతున్నారు.
    ఇక అయ్యన్నపాత్రుడు అక్రమాలకు పాల్పడి జైలుకు పోయి వచ్చాడు. అయ్యన్నపాత్రుడితో సహా, ఇప్పుడు మాట్లాడుతున్న వారంతా దోచుకోవడం, దాచుకోవడమే జీవితంగా బ్రతికారు. ప్రజలు ఈ వాస్తవాలన్నీ గుర్తించారు. టీడీపీ 5 ఏళ్ల పాలనలో తమను ఏ స్థాయిలో దోచుకున్నారనేది అందరికి అర్ధమైంది. 

ఒక్క ఇంటి స్థలమైనా ఇచ్చారా?:
    నిరుపేదలకు కనీసం ఒక్క ఇంటి స్థలం అయినా ఇవ్వలేదు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్నా పేదల ఇళ్ల కోసం కనీసం అర ఎకరం భూమి కూడా కొనలేదు. అదే సీఎంగారు రూ.55 వేల కోట్లతో, నిరుపేద కుటుంబాల్లో 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. మీకు కనీసం సిగ్గుందా?
    మేము బీసీ సభ ఏర్పాటు చేసుకున్నాం. వారికి మేము ఏం చేశామన్నది చెబుతాం. కావాలంటే మీరూ పెట్టుకోండి. వారికి ఏం చేశారో చెప్పండి. కానీ మీకు ఆ ధైర్యం లేదు. ఎందుకంటే మీరు ఏమీ చేయలేదు.

మీ సబ్‌ప్లాన్‌లోనూ మోసమే:
    టీడీపీ నాయకులు పదే పదే బీసీ సబ్‌ ప్లాన్‌ను ప్రస్తావిస్తారు. ఏటా రూ.10 వేల కోట్లు ఇస్తామని చెప్పి, అది కూడా అమలు చేయలేదు. టీడీపీ 5 ఏళ్లలో ఖర్చు చేసింది కేవలం రూ.19 వేల కోట్లే, అది కూడా బ్యాంకుల ద్వారానే రుణాల రూపంలో ఇచ్చారు. ఆ విధంగా కూడా బీసీలకు మోసం చేశారు. ఇవాళ బీసీలంతా జగన్‌గారి వెంటే ఉన్నారు. చంద్రబాబు వెంట,  ఇవాళ మాట్లాడుతున్న అయిదారుగురు మాత్రమే మిగిలారు. అందుకే తట్టుకోలేక అసూయ, ద్వేషాలతో మాట్లాడుతున్నారు.

ప్రతి పైసాకు లెక్కుంది:
    ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేస్తోందని చంద్రబాబు విమర్శించారు. నిజానికి ఈ ప్రభుత్వం చేసిన ప్రతి పైసా ప్రజల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా వెళుతుంది. అదే చంద్రబాబు చేసిన అప్పు రూ.2.70 లక్షల కోట్లతో ఏం చేశాడో తెలియదు. కానీ ఈ ప్రభుత్వం చేసిన అప్పుకు పక్కాగా లెక్క ఉంది. ప«థకాల ద్వారా నేరుగా నగదు బదిలీ జరిగింది. డీబీటీ ద్వారా ప్రజలకు చేరింది. ప్రతిదీ పారదర్శకంగా ఉంది. మీ ప్రయత్నమంతా మళ్లీ అధికారంలోకి వచ్చి దోచుకోవాలన్నదే. కానీ ప్రజలు మిమ్మల్ని నమ్మబోరు.

బీసీల గౌరవం పెరిగింది:
    ఇవాళ యాదవులు, శెట్టి బలిజలు, నాయీ బ్రాహ్మణులు, స్వర్ణకారులు, రజకులు.. ఇలా ప్రతి ఒక్క బీసీ.. తమకు గౌరవం పెరిగిందని భావిస్తున్నారు. తమకు అన్నింటా సమాన హక్కులు, అవకాశాలు దక్కాయని చెబుతున్నారు. గ్రామ వార్డు మెంబరు నుంచి.. మేయర్లు, ఛైర్మెన్లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులు వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

టీడీపీ నేతలకు సిగ్గుందా?:
    ఇవాళ మాట్లాడుతున్న టీడీపీ నాయకులకు కనీసం సిగ్గుందా? అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, బుద్ధా వెంకన్నను అడుగుతున్నాను.. మీకు సిగ్గుందా? మీ పార్టీ నుంచి ఒక్క బీసీని అయినా రాజ్యసభకు పంపించారా? అదే జగన్‌గారు ఈ మూడేళ్లలో రాష్ట్రం నుంచి నలుగురు బీసీలను రాజ్యసభ సభ్యులను చేశారు.
    చివరకు వర్ల రామయ్యకు రాజ్యసభ సభ్యుడి పదవి ఇస్తామని చెప్పి, ఆఫీస్‌కు వస్తుంటే మధ్యలో మొండిచెయ్యి చూపారు. అసలు మీకు ఏమైనా సిగ్గుందా? మీరు మాత్రం ఏం చేస్తారు? పార్టీ నేతలు ఏది రాసిస్తే అదే మాట్లాడతారు? అచ్చెన్నాయుడు ఒక సందర్భంలో ఒప్పుకున్నాడు కదా?. పార్టీ లేదు బొక్కా లేదని. ఇవాళ బీసీలకు కేవలం జగన్‌గారి పాలనలోనే న్యాయం జరిగింది. ప్రతి పథకంలో వారికి పూర్తి ప్రాతినిథ్యం దక్కింది.

ఇదేం ఖర్మరా ‘బాబూ:
    చంద్రబాబు నీకు ఏమైనా సిగ్గుందా? ఏనాడైనా నిరుపేదలు, బీసీల గురించి ఆలోచించావా?  రైతులకు కనీసం మేలు చేశావా? ఆనాడు వైయస్సార్‌గారు వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ఇస్తామంటే సాధ్యం కాదన్నావు. చంద్రబాబు పాలనలో విద్యా రంగంలో మన రాష్ట్రం 18వ స్థానంలో ఉంటే, అది ఇప్పుడు 2వ స్థానానికి చేరింది. అదీ జగన్‌గారి పరిపాలన. ఆయన చేస్తున్న కృషి, అమలు చేస్తున్న పథకాల ఫలాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు పాలనలో, ఆయన, ఆయన బంధువులు దోచుకోవడమే లక్ష్యం. అది ప్రజలకు కూడా అర్ధమైంది. అందుకే ఏం ఖర్మరా బాబూ? అని అంతా అనుకుంటున్నారు.  

మీ పునాదులు కదులుతున్నాయి:
    ఆనాడు చంద్రబాబు మత్స్యకారులను తిడితే.. కొల్లు రవీంద్ర ఎక్కడున్నాడు? ఎందుకు స్పందించలేదు? జయహో బీసీ సభతో.. చంద్రబాబుకు, టీడీపీకి మిగిలింది ఇక సమాధులే. మేము బీసీలకు ఏం చేశామనేది చెప్పబోతున్నాం. అందుకే మీ పునాదులు కదులుతున్నాయి. దాంతో దిక్కు తోచక, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు.

బీసీల గుండెల్లో వైయ‌స్ జగన్‌గారు:
    జయహో బీసీ మహాసభకు గ్రామ స్థాయి నుంచి రాజ్యసభ వరకు అన్ని పదువుల్లో ఉన్న బీసీ ప్రతినిధులను ఆహ్వానించాం. అన్ని నియోజకవర్గాల నుంచి వివిధ పదవుల్లో ఉన్న దాదాపు 85 వేల మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. బీసీ సభకు ఉత్సాహంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఎన్నికలకు ముందు ఏలూరులో బీసీ గర్జన సభలో చెప్పిన ప్రతి ఒక్క అంశాన్ని సీఎంగారు అమలు చేశారు. మహిళలు, బీసీలకు పదవుల్లో తగిన ప్రాతినిథ్యం కల్పించారు. 139 కులాలను గుర్తించి, 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. కులాల వారీగా జనగణన కూడా చేసి, వారికి మేలు చేస్తున్నారు. అందుకే బీసీల గుండెల్లో జగన్‌గారు శాశ్వతంగా నిల్చిపోతున్నారు.

 
మీకు ఆ ధైర్యం ఉందా?:
    బీసీలకు మేమేం చేశామనేది రేపు సభలో చెబుతాం. మాకు ఆ ధైర్యం ఉంది. మరి మీకు ఆ ధైర్యం ఉందా? మేము ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98 శాతం అమలు చేశాం. అదే మీరు 600కు పైగా వాగ్దానాలు చేసి, ఏదీ అమలు చేయక, చివరకు మేనిఫెస్టోను పార్టీ వెబ్‌సైట్‌ నుంచి తొలగించారు. ఇవాళ ఎలా మాట్లాడుతున్నారు. మీకు ఏ మాత్రమైనా సిగ్గుందా?

దొరికినా.. లోకేష్ మేకపోతు గాంభీర్యం:    
    ఎంతసేపూ దోచుకోవడమే మీ పని. అదే మేము ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా బీసీలకు ఎంతో మేలు చేశాము. చేస్తున్నాం. బీసీలను ఎంతసేపూ ఓటింట్‌ యంత్రాలుగానే చూశాడు చంద్రబాబు. అన్నింట్లోనూ దోపిడినే. చివరకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో కూడా దోచుకున్నారు. ఆ స్కామ్‌ బయట పడింది. దాంతో దిక్కు తోచక, పప్పు లోకేష్‌.. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు.

ఇప్పటికీ ఎన్టీఆర్‌ స్మరణేనా?:
    చంద్రబాబు ఎంతసేపూ ఎన్టీఆర్‌ పేరు మాత్రమే చెబుతున్నారు తప్ప, 14 ఏళ్లు సీఎంగా ఉండి, బీసీలకు ఏం చేశాడనేది ఎందుకు చెప్పలేకపోతున్నాడు. ఎందుకంటే బీసీలకు చంద్రబాబు ఏమీ చేయలేదు కాబట్టి. ఇప్పుడు కూడా సిగ్గు లేకుండా ఎన్టీ రామారావు పేరు చెప్పుకుంటున్నారు.
    జయహో బీసీ సభ అనగానే.. టీడీపీ నేతల్లో వణుకు మొదలైంది. దమ్ముంటే రమ్మనండి. మా పార్టీలో బీసీలకు ఎన్నెన్ని పదవులు ఇచ్చామో చెబుతాం. మరి వారు అలా చెప్పుకునే ధైర్యం ఉందా? రాజ్యసభకు నలుగురు బీసీలను పంపాం. మాకు ఆ చిత్తశుద్ధి ఉంది. చంద్రబాబు తన సామాజికవర్గానికి చెందిన వారిని మాత్రమే రాజ్యసభకు పంపారు, అయినా ఆ పార్టీ బీసీ నేతలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ధ్వజమెత్తారు.

Back to Top