గుంటూరు జిల్లా: గుంటూరు నగరంలోని గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలో వైద్యసేవలు, వైద్యుల తీరుపై వైయస్ఆర్‌సీపీ నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరానికి చెందిన ఆరు సంవత్సరాల ఫణింద్ర రెడ్డి అనే బాలుడిపై ఏకంగా 10కి పైగా కుక్కలు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన బాలుడిని అతని తల్లి గౌతమి, కుటుంబ సభ్యులు వెంటనే గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న గుంటూరు నగర వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, ఈస్ట్ ఇన్‌ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా హుటాహుటిన జీజీహెచ్‌కు చేరుకున్నారు. ఆసుపత్రిలో కనీస వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో లేవని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలుడికి తక్షణ చికిత్స అందించడంలో ఆలస్యం ఎందుకైందని వైద్యులను ఆమె ప్రశ్నించారు. నూరి ఫాతిమా రాగానే అవసరమైన వైద్య పరికరాలు ఏర్పాటు చేసి చికిత్స ప్రారంభించినట్లు అక్కడి పరిస్థితులు తెలియజేశాయి. ఐసీయూకి ఎందుకు తరలించలేదని ప్రశ్నించగా వైద్యులు పొంతనలేని సమాధానాలు ఇస్తున్నారని ఆమె విమర్శించారు. జరిగిన ఘటనపై వివరాలు తెలుసుకోవడానికి ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు ఫోన్ చేసినప్పటికీ స్పందించలేదని, ఆయన వైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని నూరి ఫాతిమా డిమాండ్ చేశారు.