తాడేపల్లి: సాక్షి టీవీ మాజీ వీడియో జర్నలిస్ట్, ప్రస్తుతం వార్డు సచివాలయంలో సెరికల్చర్ కార్యదర్శిగా పనిచేస్తున్న రమాకాంత్ (50) రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం అత్యంత బాధాకరమని వైయస్ఆర్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. అనంతపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రమాకాంత్ బెంగళూరులో ఐదు రోజులపాటు చికిత్స పొందుతూ మృతి చెందారని తెలిపారు. వీడియో జర్నలిస్ట్‌గా మీడియా రంగానికి ఆయన అందించిన సేవలను సజ్జల స్మరించుకున్నారు. విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసిన వ్యక్తిగా రమాకాంత్ గుర్తుండిపోతారని పేర్కొన్నారు. మరణానంతరం కూడా అవయవదానం ద్వారా పలువురికి కొత్త జీవితాన్ని ప్రసాదించి రమాకాంత్ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఆయన చివరి కోరిక మేరకు కళ్లు, కిడ్నీలు, గుండె, కాలేయం తదితర అవయవాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయం మహోన్నతమైనదన్నారు. ఈ అవయవదానం ద్వారా ఆరుగురి జీవితాల్లో వెలుగులు నింపడం రమాకాంత్ మానవత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. కుటుంబ సభ్యుడిని కోల్పోయిన తీవ్ర విషాదంలోనూ అవయవదానం వంటి గొప్ప నిర్ణయం తీసుకున్న రమాకాంత్ కుటుంబ సభ్యులు సమాజానికి స్ఫూర్తిగా నిలిచారని సజ్జల అన్నారు. రమాకాంత్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.