మంత్రి లోకేష్ కోటాలో మెగా డీఎస్సీ ఉద్యోగాల పేరుతో భారీ మోసం: 

మాజీ సీఎం వైయస్ జగన్‌ను ఆశ్రయించిన డిఎస్సీ బాధితురాలు రాధిక.

టీడీపీ నేతల పేర్లు చెప్పి లక్షలు వసూలు చేసి మోసం చేశారు. 

పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగట్లేదు: 

కన్నీటి పర్యంతమైన డిఎస్సీ బాధితురాలు రాధిక.

డబ్బులు తీసుకుని డీఎస్సీలో ఉద్యోగమిప్పిస్తామంటూ మోసం చేశారని మాజీ సీఎం వైయస్.జగన్ కి మొరపెట్టుకున్న డిఎస్సీ అభ్యర్ధి రాధిక.

తనకు జరిగిన మోసాన్ని క్యాంపు కార్యాలయంలో వైయస్.జగన్ కి వివరించిన బాధితురాలు.

లోకేష్ కోటాలో తనకు ఉద్యోగం ఇప్పిస్తామంటూ టీడీపీ కార్యకర్తలు మేడికొండ జ్యోతి, ఆడపా భాను ప్రకాష్ లు మోసం చేశారని కన్నీటిపర్యంతం అయిన రాధిక

పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని వాపోయిన రాధిక.

తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ టీడీపీకి చెందిన వ్యక్తులు తనను దారుణంగా మోసం చేశారని ప్రకాశం జిల్లా ఒంగోలు మండలానికి చెందిన అభ్యర్థి రాధిక ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్ కోటాలో స్కూల్ అసిస్టెంట్ పోస్టు ఇప్పిస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేసి మోసం చేశారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆమె వాపోయారు. ఈ మేరకు గురువారం తాడేపల్లిలోని వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించి, న్యాయం చేయాలని వేడుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బాధితురాలు రాధిక, తనకు జరిగిన మోసం తీరును వెల్లడించారు.

 ఈ సందర్భంగా రాధిక ఏమన్నారంటే..

నారా లోకేష్ పేరుతో నమ్మించి మోసం చేశారు.. నా భవిష్యత్తును నాశనం చేశారు.
డిఎస్సీ బాధితురాలు రాధిక.

నా పేరు రాధిక, మాది ఒంగోలు మండలం. ఏపీ మెగా డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి నన్ను మోసం చేశారు. అద్దంకి మండలం శంకరాపురం గ్రామానికి చెందిన మేడికొండ నాగజ్యోతి అనే మహిళ నాకు పరిచయమైంది. తనకు విజయవాడ కానూరుకు చెందిన అడపా భాను ప్రకాష్ అనే వ్యక్తి పరిచయమని, అతను గతంలో సైబర్ సెక్యూరిటీలో పోలీస్ ఆఫీసర్‌గా చేశాడని, ప్రస్తుతం వ్యాపారాలు చేస్తున్నాడని చెప్పింది. అతనికి ఉన్నత స్థాయి పరిచయాలతో పాటు మంత్రి నారా లోకేష్ దగ్గరి వ్యక్తులతో మంచి సంబంధాలు ఉన్నాయని నమ్మించింది.
‘ఓసీ అభ్యర్థులకు ఉద్యోగాలు రావడం కష్టం, నాకు కూడా ఏపీ టూరిజంలో ఉద్యోగం ఇప్పించాడు, నీకు పుట్టబోయే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది’ అని మాయమాటలు చెప్పి మా వద్ద అప్పులు చేయించి మరీ డబ్బులు వసూలు చేశారు. నాగజ్యోతి ప్లాన్ ప్రకారమే డబ్బులను అడపా భాను ప్రకాష్ ఖాతాలో వేయించారు.
డబ్బులు తీసుకున్న తర్వాత నాకు డీఎస్సీ పరీక్ష రాయొద్దని చెప్పారు. ‘నువ్వు పరీక్ష రాస్తే రెండు అకౌంట్లు క్రియేట్ అవుతాయి, క్వాలిఫై కాకపోతే సమస్య వస్తుంది’ అని చెప్పి పరీక్ష కూడా రాయనివ్వకుండా నా కెరీర్‌ను పూర్తిగా నాశనం చేశారు.
నాతో పాటే కృష్ణా జిల్లాకు చెందిన వేముల రామకృష్ణ అనే వ్యక్తికి కూడా ప్రాసెస్ చేస్తున్నామని చెప్పారు. అతని పేరు జాబితాలో వచ్చి ప్రస్తుతం కృష్ణా జిల్లాలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు, కానీ నాకు మాత్రం ఉద్యోగం రాలేదు, డబ్బులూ తిరిగి ఇవ్వలేదు.
దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే అడపా భాను ప్రకాష్ స్టేషన్‌కు వచ్చి డీఎస్సీ కోసమే డబ్బులు తీసుకున్నానని రాతపూర్వకంగా ఒప్పుకున్నాడు. కానీ స్టేట్‌మెంట్ ఇచ్చి వెళ్లిన తర్వాత ఎన్ని నోటీసులు పంపినా హాజరు కావడం లేదు. పోలీసులు కూడా ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవడం లేదు. మేడికొండ నాగజ్యోతి రాష్ట్రంలో లేదని పోలీసులు తప్పించుకునే సమాధానాలు చెబుతున్నారు. మేము గట్టిగా అడిగితే ఆమే రివర్స్‌లో మాపై కేసులు పెడుతూ వేధిస్తోంది. ఎస్ఐ, పోలీసులు కూడా వాళ్లకు వత్తాసు పలుకుతూ ఎదురుచూడమని చెబుతున్నారే తప్ప నిందితులను అరెస్ట్ చేయడం లేదు.
మాకు జరుగుతున్న అన్యాయంపై న్యాయం కోసం మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారెని కలిశాను. జగన్ సార్ మాత్రమే మాకు న్యాయం చేయగలరనే నమ్మకంతో ఇక్కడికి వచ్చాను. నా బాధను విన్న జగన్ సార్ పరిశీలించి ఖచ్చితంగా న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను.

Back to Top