వైయస్ఆర్ కడప జిల్లా: దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాను నిరాకరిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పును పునఃసమీక్షించి, వారికి పూర్తి స్థాయిలో సామాజిక న్యాయం చేయాలని వైయస్ఆర్‌సీపీ కడప జిల్లా ముఖ్య నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కడపలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పార్టీ నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సమావేశంలో వైయస్ఆర్ కడప జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజాద్ బాషా, ఎమ్మెల్సీ రామచంద్రరెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు తెలుగుపులి వెంకటసుబ్బమ్మ, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఎస్సీ సెల్ నాయకుడు వల్లూరు కిషోర్, రాష్ట్ర మాజీ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ పులి సునీల్ కుమార్, మాజీ మేయర్ పాకా సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాను నిరాకరించడం భారత రాజ్యాంగంలోని సమానత్వ హక్కు, వివక్ష నిరసన మరియు మత స్వేచ్ఛకు సంబంధించిన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. కేవలం మత మార్పిడి జరిగినంత మాత్రాన సమాజంలో వారు ఎదుర్కొనే సామాజిక వివక్ష, వెనుకబాటుతనం తొలగిపోదని, అందువల్ల వారికి లభించాల్సిన రిజర్వేషన్ హక్కులను కొనసాగించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. దళిత క్రైస్తవులు ఇప్పటికీ సామాజిక, ఆర్థిక, విద్యా రంగాల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి రాజ్యాంగ పరిరక్షణలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తన తీర్పును పునఃసమీక్షించి దళిత క్రైస్తవులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి పోస్ట్‌కార్డ్ ఉద్యమం ద్వారా, చట్టపరమైన మార్గాల ద్వారా విన్నపాలు పంపుతున్నట్లు వెల్లడించారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాల దిశగా సుప్రీంకోర్టు సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, దళిత క్రైస్తవ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.