పొదిలిలో పొగాకు రైతుల రాస్తారోకో..  

మార్కాపురం : గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. దళారుల ఆధిపత్యం పెరగడంతో తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు రాస్తారోకో నిర్వహించి, అక్కడి నుంచి వెళ్తున్న జిల్లా ఎస్పీ కాన్వాయ్‌ను అడ్డుకుని తమ సమస్యలను వినిపించారు. పొగాకు కొనుగోళ్లలో దళారీ వ్యవస్థ పూర్తిగా పెచ్చరిల్లిందని, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. నెలల తరబడి శ్రమించి పండించిన పంటను నష్టాలతో విక్రయించాల్సిన పరిస్థితి నెలకొందని, ప్రభుత్వ యంత్రాంగం స్పందించకపోవడంతో రోడ్డెక్కాల్సి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకు మార్కెట్‌లో పారదర్శకత తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైందని, దళారుల చేతుల్లో రైతులు బలవుతున్నారని రైతులు ఆరోపించారు. రైతుల కష్టాలకు పరిష్కారం చూపాల్సిన ప్రభుత్వం ప్రేక్షక పాత్రకే పరిమితమైందని విమర్శించారు.

రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి, దళారుల ప్రమేయాన్ని అరికట్టి, గిట్టుబాటు ధరలు కల్పించేలా ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ఘటన రైతాంగం ఎదుర్కొంటున్న సంక్షోభానికి నిదర్శనమని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు, రైతులకు మార్కెట్ భరోసా కల్పించేందుకు ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు.
 

Back to Top