అనంతపురం: రైతులకు వైయస్ఆర్ బీమా, ఉచిత పంటల బీమా పథకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పుట్లూరు మండల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి, సింగనమల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజనాథ్ ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షుడు పొన్నపాటి మహేశ్వర్ రెడ్డి నాయకత్వంలో రైతులు, పార్టీ నాయకులు స్థానిక గ్రామీణ బ్యాంకు, తహసీల్దార్ కార్యాలయాల వద్ద వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, వైయస్ జగన్‌మోహన్ రెడ్డి హయాంలో రైతులకు వైఎస్సార్ బీమా, ఉచిత పంటల బీమా ద్వారా భరోసా కల్పించారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాలు నిలిచిపోయాయని విమర్శించారు. పెండింగ్‌లో ఉన్న బీమా, పంటల ఇన్సూరెన్స్ సొమ్ములను వెంటనే విడుదల చేసి అర్హులైన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతు కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ, సమస్యలు పరిష్కరించకపోతే రైతులతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల రైతు విభాగ నాయకులు, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.