విజయవాడ : కూటమి ప్రభుత్వం నిర్వహించినది మెగా డీఎస్సీ కాదని, నిరుద్యోగులను మోసం చేసిన "దగా డీఎస్సీ" అని వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రవిచంద్ర ఆక్షేపించారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధిత అభ్యర్థులకు న్యాయం చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. డీఎస్సీ-2025 నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ గాంధీనగర్ ధర్నా చౌక్‌లో నిరుద్యోగ దివ్యాంగ అభ్యర్థి అంజనప్ప, బీసీ మహిళా అభ్యర్థి పి. ప్రభావతి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రవిచంద్ర సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డీఎస్సీ-2025 నియామకాల్లో భారీ అవినీతి, అక్రమాలు జరిగాయని ఆరోపించారు. బాధిత అభ్యర్థుల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మీడియాకు దూరంగా ఉంటున్నారని విమర్శించారు. 16,347 పోస్టుల పేరుతో నిర్వహించిన మెగా డీఎస్సీ నిరుద్యోగులను మోసం చేసిన "దగా డీఎస్సీ"గా మారిందన్నారు. డీఎస్సీ అక్రమాలపై వెంటనే సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని, బాధితులకు న్యాయం చేయలేకపోతే మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలన్నారు. డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపి బాధిత అభ్యర్థులకు న్యాయం చేయాలని, పారదర్శకతతో నియామక ప్రక్రియను నిర్వహించాలని రవిచంద్ర డిమాండ్ చేశారు. దివ్యాంగ అభ్యర్థి అంజనప్ప మాట్లాడుతూ, విద్యాశాఖ అధికారులు, డీఈఓ, కన్వీనర్, కమిషనర్ కలిసి తనకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. నెలల తరబడి అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదని, 40 శాతం వైకల్య ధ్రువీకరణ పత్రం ఉన్నప్పటికీ తన అర్హతను పరిగణనలోకి తీసుకోలేదన్నారు. అర్హత లేని వ్యక్తిని ఎంపిక జాబితాలో ఎలా చేర్చారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ ఆదేశాలు ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగం ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. కోర్టులకు కూడా అధికారులు తప్పుదోవ పట్టించే సమాచారం అందిస్తున్నారని, తన వద్ద ఉన్న అన్ని ఆధారాలను బహిరంగంగా చూపించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలానికి చెందిన అభ్యర్థి పి. ప్రభావతి మాట్లాడుతూ, హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం తనకు ఉద్యోగం రావాల్సి ఉన్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో అవకాశం కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. తన వివరాలను సక్రమంగా నమోదు చేయకపోవడంతో బీసీ-ఏ మహిళ కోటాలో ఉద్యోగం కోల్పోయానన్నారు. పలు కమిటీల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా స్పందన లేదని, అర్హత లేని వ్యక్తులకు ఉద్యోగాలు ఎలా కల్పించారో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తానని హెచ్చరించారు. వైయస్ఆర్‌సీపీ వికలాంగుల విభాగం ప్రధాన కార్యదర్శి రాజేష్ మాట్లాడుతూ, ఇది మెగా డీఎస్సీ కాదని, నిరుద్యోగులను మోసం చేసిన "దగా డీఎస్సీ" అని విమర్శించారు. హారిజాంటల్ రిజర్వేషన్ అమలులో తీవ్ర అక్రమాలు జరిగాయని, మెడికల్ బోర్డు ఇచ్చిన ధ్రువీకరణలను కూడా పట్టించుకోకుండా అర్హులైన అభ్యర్థులకు అన్యాయం చేశారని ఆరోపించారు. దాదాపు 500 మంది అభ్యర్థులు డీఎస్సీ అక్రమాలపై కోర్టును ఆశ్రయించారని తెలిపారు. బాధితుల సమస్యలను వైయస్ జగన్‌మోహన్ రెడ్డి స్వయంగా విని, వారి తరఫున న్యాయపోరాటం చేసేందుకు పార్టీ లీగల్ సెల్‌ను ఏర్పాటు చేశారని చెప్పారు.