హత్య చేసిన చేతులతో.. దండం పెట్టే వ్యక్తి చంద్రబాబు 

 మాజీ మంత్రి పేర్ని నాని

విజ‌య‌వాడ‌:  ఎంతో చరిత్ర కలిగిన ఎన్టీఆర్‌కు.. తనకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుతో దండ వేయించేకునే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు పేర్ని నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనం గుండెల్ని గెలిచిన వ్యక్తి ఎన్టీఆర్ అని, దేశంలో రాజకీయ పార్టీల నేతలకు సింహస్వప్నమని కీర్తించారు. పేదలకు రూ.2లకే కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టిన గొప్ప నాయకుడని పొగడ్తల వర్షం కురిపించారు.
 

పేదలకు పక్కా ఇల్లు పథకం ప్రవేశపెట్టిన ఒకే ఒక్కడు ఎన్టీఆర్ అని.. మునసబుదారీ వ్యవస్థను రద్దు చేసి, రైతులకు మేలు చేశారని పేర్ని నాని పేర్కొన్నారు. తెలుగువారి ప్రతిష్టను ప్రపంచానికి చాటిచెప్పడంతో పాటు రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్ ఎంతో మేలు చేశారని కొనియాడారు. ఎన్టీఆర్ అంటే ఒక చరిత్ర అని, అలాంటి ఎన్టీఆర్‌కు ఈరోజు దౌర్భాగ్య పరిస్థితి రావడాన్ని చూస్తే బాధేస్తోందని భావోద్వేగానికి లోనయ్యారు. తనని కుర్చీలోంచి కూలదోసి, వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుతో దండ వేయించుకునే దుస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. ఇలాంటి దుర్మార్గుల చేతుల మీదుగా వర్ధంతులు, జయంతులు జరిపించుకోవాల్సిన దుస్థితి ఎన్టీఆర్‌కు పట్టిందన్నారు. హత్య చేసిన చేతులతో దండం పెట్టే వ్యక్తి చంద్రబాబు అని.. ఏరుదాటాక తెప్పతగలెట్టే రకమని విమర్శించారు. అరచేతితో సూరీడుని అడ్డుకోలేరన్నారు. 2024లో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 
 

తాజా వీడియోలు

Back to Top