విజయవాడ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని కమిటీలు, అనుబంధ విభాగాల్లో నియమకాలు 45 రోజుల్లో పూర్తి చేయాలని ఎన్టీఆర్ జిల్లా వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ సూచించారు. సోమవారం ఎన్టీఆర్ జిల్లా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన “వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు పాల్గొని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లాలో మండల, బూత్ స్థాయిల్లో అన్ని కమిటీలను, అలాగే అనుబంధ విభాగాల నియామకాలను 45 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. పార్టీని గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పటిష్టంగా నిర్మించడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్తకు బాధ్యతలు కేటాయించాలని సూచించారు. కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బలమైన సంస్థాగత నిర్మాణం అత్యంత అవసరమని దేవినేని అవినాష్ తెలిపారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడే విధంగా పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని, నియోజకవర్గంలో ప్రతి బూత్‌లో పార్టీ ఉనికిని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎన్టీఆర్–కృష్ణా జిల్లాల టాస్క్‌ఫోర్స్ ఇంచార్జ్ వరుకుటి అశోక్‌బాబు గారు, రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు గారు, అలాగే రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి పదవుల్లో ఉన్న నాయకులు పాల్గొన్నారు. ఫ్లోర్ లీడర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, డిజిటల్ మేనేజర్లు తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేసి, రాబోయే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీని విజయతీరాలకు చేర్చాలని నాయకులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.