రాజమహేంద్రవరం : రాష్ట్రంలో జరిగిన కల్తీ పాలు ఘటన ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే చోటుచేసుకుందని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ మండిపడ్డారు. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరమని, దీనిని ప్రభుత్వ హత్యలుగా పరిగణించాల్సిందే అని ఆయన అన్నారు. గురువారం రాజమహేంద్రవరంలోని రామాలయం సెంటర్ వద్ద వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మానవహారం నిర్వహించి కల్తీ పాలు ఘటనపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంఘటన జరిగి 15 రోజులు గడిచినా ఇప్పటికీ పాలలో కల్తీ ఎలా జరిగిందన్న దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని విమర్శించారు. రోజుకో మృతదేహం ఆసుపత్రి నుంచి బయటికి వస్తోందని ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ ఘటనలో 9 మంది మరణించినప్పటికీ ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల కేంద్రాలను తనిఖీ చేయకపోవడం ఎందుకని ప్రశ్నించారు. సంబంధిత అధికారులపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఈ విషయంలో చీకటి వ్యవహారం నడుపుతోందని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ ఘటన ఎలా జరిగింది, ఎవరి ప్రమేయం ఉందన్నది పూర్తిగా బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే వేట్లపాలెం లో జరిగిన ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం, రాజమండ్రిలో కల్తీ పాలు తాగి మృతి చెందిన బాధితులకు రూ.10 లక్షలు మాత్రమే ప్రకటించడం ఏమిటని ప్రశ్నించారు. “అక్కడ ప్రాణమే, ఇక్కడ కూడా ప్రాణమే కదా” అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 13 మంది బాధితులకు ప్రభుత్వం ఎలాంటి వైద్య సౌకర్యాలు అందిస్తున్నదో స్పష్టంగా తెలియజేయాలని డిమాండ్ చేశారు. పాలలో ఎథిలిన్ గ్లైకాల్ కలిసినట్లు చెబుతూ యాంటిడోస్ తెప్పించామని ప్రభుత్వం చెప్పిందని, అయితే ఎంతమందికి ఆ మందులు అందించారో వివరాలు వెల్లడించాల్సిన అవసరం ఉందన్నారు. కల్తీ పాలు ఘటనకు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచడం అనుమానాలకు తావిస్తోందని భరత్ అన్నారు. చిన్న పాల వ్యాపారులను ప్రోత్సహిస్తూ భద్రతా నియమాలు కచ్చితంగా పాటించేలా అధికారులు కఠిన పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్‌చార్జీలు, వివిధ విభాగాల అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.