తాడేపల్లి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయ్యాయని, కానీ ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు కాలేదని మాజీమంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. “మహానాడు పేరుతో దగానాడు నిర్వహిస్తున్నారు” అది మహానాడు కాదు..దగానాడు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. వైయస్ఆర్‌సీపీ నేతలను భయబ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రచారం చేసిన సూపర్ సిక్స్, సూపర్ హిట్ పథకాలు ఎక్కడ అమలయ్యాయో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. అందుకే చంద్రబాబు మోసాల మానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైయస్ఆర్‌సీపీ సిద్ధమైందని, జూన్ 4 నుంచి పార్టీ కార్యాచరణ ప్రారంభమవుతుందని వెల్లడించారు. వైయస్ జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి పనులకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం క్రెడిట్ చోరీ చేస్తోందని ఆర్కే రోజా విమర్శించారు. “ఈ రెండేళ్లలో మీరు ప్రారంభించి పూర్తి చేసిన ఒక్క పని అయినా ఉందా?” అని ప్రశ్నించారు. విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత నారా లోకేష్ కారణంగా రాష్ట్ర విద్యా వ్యవస్థ కుంటుపడిందని ఆరోపించిన ఆమె.. “ఇవాళ ఆయనను పార్టీ అధ్యక్షుడిని చేశారు. జగన్ చేసిన అభివృద్ధిని మీరు ఎందుకు చేయలేకపోతున్నారు?” అంటూ విమర్శించారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించిన రోజా.. “మీరు మంత్రిగానే పనికిరారు.. మిమ్మల్ని పార్టీ అధ్యక్షుడిని ఎలా చేశారు?” అంటూ ఎద్దేవా చేశారు. “ప్రశ్నిస్తా అన్న నాయకుడు ఇప్పుడు ఏం చేస్తున్నారో ప్రజలకు అర్థం కావడం లేదు” అన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావిస్తూ.. “మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే గతంలోనే ఎందుకు అమలు చేయలేదు? ఇప్పుడు మాత్రమే ఎందుకు అన్నీ గుర్తుకొస్తున్నాయి?” అని రోజా ప్రశ్నించారు.