గీతం కబ్జా చేసిన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్‌

అమరావతి: గీతం యూనివర్సిటీ కబ్జా చేసిన భూములను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని, వాటి రెగ్యులరైజేషన్ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని  వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు. శుక్ర‌వారం అసెంబ్లీ మీడియా పాయింట్ వ‌ద్ద ఆమె మాట్లాడుతూ… కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారికి రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు తన బినామీలు, అనుచరులకు 99 పైసలకు భూములు కట్టబెడుతున్నారని విమర్శించారు. సుమారు రూ.5 వేల కోట్ల విలువైన భూములను తన కుటుంబ సభ్యులకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆమె పేర్కొన్నారు. విశాఖపట్నాన్ని ఫైనాన్షియల్ క్యాపిటల్‌గా అభివృద్ధి చేస్తామని చెప్పి, దానిని దోపిడీ క్యాపిటల్‌గా మార్చేశారని విమర్శించారు. విశాఖపట్నం మేయర్‌గా ఉన్న బీసీ మహిళను అడ్డగోలుగా పదవి నుంచి తొలగించారని, గీతం కబ్జా చేసిన భూములను రెగ్యులరైజ్ చేయడానికే ఈ చర్యలు తీసుకున్నారని ఆరోపించారు.

పేదలు చిన్న చిన్న గుడిసెలు వేసుకున్నా, బడ్డీ కొట్లు పెట్టుకున్నా ప్రోక్లెయిన్‌లతో కూల్చివేస్తున్న ప్రభుత్వం, పెద్దలు చేసిన భూకబ్జాల విషయంలో మాత్రం చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఆధీనంలో ఉన్న భూములను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వకూడదని కోర్టు తీర్పులు ఉన్నప్పటికీ ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం లేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పులకూ కూటమి పెద్దలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భయపడడం లేదని విమర్శించారు. గీతం యూనివర్సిటీ కబ్జా చేసిన భూములపై ల్యాండ్ గ్రాబింగ్ కేసులు నమోదు చేసి, ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు. ఈ విషయంలో న్యాయం జరిగే వరకు వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం ఆగదని ఆమె స్పష్టం చేశారు.
 

Back to Top