తాడేపల్లి: వైయస్ జగన్ గారి ఐదేళ్ల పాలన దేశానికే బెంచ్ మార్క్‌గా నిలిచిందని, విజనరీనని చెప్పుకునే చంద్రబాబు రెండేళ్లలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను విధ్వంసం చేశారని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు ధ్వజమెత్తారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా వంటి సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు ఆపకుండా ప్రజలను ఆదుకున్న వైయస్ జగన్ గారి పేరెత్తే అర్హత చంద్రబాబుకి లేదని స్పష్టం చేశారు. చంద్రబాబుకి చేతనైతే జగన్ కన్నా మిన్నగా పాలన చేసి ప్రజలతో ప్రశంసలు అందుకోవాలని సవాల్ విసిరారు. అంతేకాని సైకో, తుగ్లక్ అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడితే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ఇప్పటికే చంద్రబాబు రెండేళ్ల పాలనను వైయస్ జగన్ పాలనతో పోల్చి చూస్తున్నారని చెప్పారు. ఆచరణ సాధ్యంకాని అమరావతికి ప్రత్యామ్నాయంగా వైయస్ జగన్ గారి మావిగన్ ఐడియా ప్రజల్లోకి చొచ్చుకుపోవడంతో సమాధానం చెప్పుకోలేక అసహనంతో వైయస్ జగన్ గారి మీద వ్యక్తిత్వ హననం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... దుబారా చేస్తూ సూక్తులు చెబుతారా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గడిచిన రెండేళ్లుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంది. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారు ఇప్పటివరకు 25 ప్రెస్‌మీట్లు నిర్వహించి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతి, అసమర్థ పాలన, సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం వంటి అనేక అంశాలపై నిత్యం ప్రశ్నిస్తూనే ఉన్నారు. వైయస్ఆర్‌సీపీ సైతం రెండేళ్లుగా ఎన్నో ప్రజా పోరాటాలు చేసింది. రైతులు, దళితులు, మహిళలు, ఉద్యోగులు, నిరుద్యోగులు.. ఇలా అన్ని వర్గాల పక్షాన పోరాడుతూనే ఉంది. కానీ ఇప్పటి వరకు వైయస్ జగన్ గారి ప్రశ్నలకు దేనికీ సూటిగా ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతోంది. కూటమి ప్రభుత్వానికి ప్రజా సమస్యల పరిష్కారం పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పేరే.. పాలన గాడి తప్పిందని ప్రచారం చేసే టీడీపీ నాయకులు, గత వైయస్ఆర్‌సీపీ పాలన కన్నా ఈ రెండేళ్లలో ఏ విషయంలో మిన్నగా పాలన అందించారో చెప్పాలి. ప్రత్యేక విమానాలు, హెలిక్యాప్టర్‌లలో తిరుగుతూ విలాసాలతో రోజులు గడిపేస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లు ప్రజలకు దుబారా మానుకోవాలని సూక్తులు చెప్పడం హేయం. జగన్ పాలన దేశానికే బెంచ్ మార్క్ వైయస్ జగన్ గారు తన ఐదేళ్ల పాలనలో మేనిఫెస్టోలో ఇచ్చిన 99 శాతం హామీలను అమలు చేసి రాజకీయాల్లో పాలనకు ఒక బెంచ్ మార్కుగా నిలిచారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టారు. కానీ తప్పుడు ప్రచారం, మోసపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, ప్రజలను నిండా ముంచేశాడు. కూటమి అధికారంలోకి వస్తే వైయస్ జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ అంతకన్నా మిన్నగా అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు, కొత్తవి ఇవ్వకపోగా.. గతంలో వైయస్ఆర్‌సీపీ హయాంలో ఇచ్చిన సంక్షేమ పథకాలను పూర్తిగా ఆపేశాడు. ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తామని చెప్పిన చంద్రబాబు, పిల్లలే సంపద, ఒక్కొక్కరు ముగ్గురు నలుగురు పిల్లల్ని కనండని ఉచిత సలహాలిస్తున్నాడు. మహిళలను పిల్లల్ని కనే యంత్రాలుగా చూస్తున్నాడు. కానీ పిల్లల్ని కనాలని తన కొడుక్కి మాత్రం ఎందుకు చెప్పడం లేదు? కరోనా సంక్షోభం రాష్ట్రాన్ని అతలాకుతలం చేసినా సంక్షేమ పథకాలు ఆపకుండా ప్రజలకు వైయస్ జగన్ గారు మేలు చేస్తే, నేడు చంద్రబాబు సూపర్ సిక్స్‌లో కనీసం మూడు గ్యాస్ సిలిండర్లు కూడా ఇవ్వలేక చేతులెత్తేశాడు. అభివృద్ధి లేదు. సంక్షేమ పథకాలు ఇవ్వడం లేదు. కానీ రెండేళ్లు గడవకుండానే చేసిన రూ. 3.40 లక్షల కోట్ల అప్పులన్నీ ఏమైనట్టు? పార్టీలు చూడకుండా అర్హతే ప్రామాణికంగా ఐదేళ్లు పారదర్శకంగా పాలన అందజేసిన వైయస్ జగన్ గారి గురించి మాట్లాడే హక్కు చంద్రబాబు సహా కూటమి నాయకులెవరికీ లేదు. హత్యారాజకీయాలకు కేరాఫ్ చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశ విధానాలపై వైయస్ఆర్‌సీపీ ప్రశ్నిస్తుంటే నాయకులు, కార్యకర్తలను అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు. తుగ్లక్, సైకో అంటూ వైయస్ జగన్ గారి మీద వ్యక్తిత్వ హననానికి దిగుతున్నారు. సొంత తాత రాజారెడ్డిని చంపినా వారిని వదిలేసిన గొప్ప మనసున్న వ్యక్తి వైయస్ జగన్ గారు. ఆయన ప్రతీకారం తీర్చుకోవాలని ఏరోజూ అనుకోలేదు. కానీ రాజారెడ్డి గారిని చంపిన నిందితులకు ఆశ్రయం కల్పించిన చంద్రబాబు, గొడ్డలి పార్టీ అంటూ వైయస్ఆర్‌సీపీ బురద జల్లడం సిగ్గుచేటు. అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానని హెచ్చరించిన మూడు రోజులకే వైయస్సార్ గారు హెలిక్యాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఆ మహానేత మరణంపై ఇప్పటికీ ప్రజల్లో ఎన్నో అనుమానాలున్నాయి. వివేకానందరెడ్డి కేసును అడ్డం పెట్టి ఏడేళ్లుగా చేయని కుట్రలు లేవు. వివేకాను నేనే చంపానని ఒప్పుకున్న దస్తగిరిని సీఎం చంద్రబాబు చట్టపరంగా శిక్షించకపోగా తన కేసులను వాదిస్తున్న సిద్ధాథ్ర లూథ్రా వంటి కాస్ట్‌లీ లాయర్‌తో దస్తగిరి కేసులను వాదించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? రాష్ట్రంలో హత్యా రాజకీయాలకు చంద్రబాబే ఆద్యుడు. కాపు నాయకుడు వంగవీటి మోహనరంగా, జర్నలిస్ట్ పింగళి దశరథరామ్ వంటి వారి హత్యల్లో ఇప్పటికీ అన్ని వేళ్లూ చంద్రబాబువైపే చూపిస్తున్నాయి. ప్రజా సమస్యల పట్ల చంద్రబాబు ఎలా వ్యవహరిస్తాడో ఎన్నోసార్లు రాష్ట్రమంతా చూసింది. ఆ అలవాట్లను వైయస్ జగన్ గారికి ఆపాదించే కుట్ర చేస్తున్నారు. రెండేళ్లుగా రాష్ట్రంలో విధ్వంస పాలన గడిచిన ఐదేళ్ల వైయస్ జగన్ పాలనను చంద్రబాబు విధ్వంస పాలనతో ప్రజలు పోల్చి చూస్తున్నారు. రెండేళ్లుగా ఏం చేశావని ప్రజలే స్వచ్ఛందంగా చంద్రబాబుని ప్రశ్నిస్తున్నారు. ఆచరణ సాధ్యంకాని అమరావతికి ప్రత్యామ్నాయంగా వైయస్ జగన్ గారు ప్రతిపాదించిన మావిగన్ ఐడియాకి ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో తట్టుకోలేక చంద్రబాబు అసహనంతో ఊగిపోతున్నాడు. దాన్నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి మంత్రులను పంపించి వ్యక్తిత్వ హననం చేయిస్తున్నాడు. కట్టుకథలతో అక్రమ కేసులు పెట్టి వైయస్ఆర్‌సీపీ నాయకులను దౌర్జన్యంగా అరెస్టు చేస్తున్నారు. గొంతెత్తితే అరెస్ట్. సోషల్ మీడియాలో పోస్టు పెడితే నోటీసు. వైయస్ జగన్ గారు మాట వింటే చంద్రబాబుకి వణుకు పుడుతోందని జూపూడి ప్రభాకర్ రావు స్పష్టం చేశారు.