గుంటూరు జిల్లా: జిల్లాలో కూటమి ప్రభుత్వ అరాచకాలు కొనసాగుతున్నాయి. రైతులను పరామర్శించేందుకు మామిళ్లపల్లి గ్రామానికి వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతిని పోలీసులు అడ్డుకోవడం పట్ల వైయస్ఆర్‌సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పది రోజుల క్రితం మామిళ్లపల్లి గ్రామంలో రైతులపై ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అనుచరులు దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో పలువురు రైతులు గాయపడగా, బాధితులను పరామర్శించి వారి సమస్యలను తెలుసుకునేందుకు కోన రఘుపతి గ్రామానికి బయలుదేరారు. అయితే మార్గమధ్యంలోనే పోలీసులు ఆయనను అడ్డుకొని ముందుకు వెళ్లనీయకుండా నిలిపివేశారు. ఈ సందర్భంగా కోన రఘుపతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులపై దాడులు జరుగుతున్నా చర్యలు తీసుకోకుండా, బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న ప్రతిపక్ష నాయకులను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. వైయస్ఆర్‌సీపీ నాయకులు మాట్లాడుతూ.. రైతులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు, బాధితులకు అండగా నిలుస్తున్న నాయకులను అడ్డుకోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, అధికార పార్టీ నేతల అండదండలతో దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.