రాజమహేంద్రవరం: నగరంలో విద్యుత్ ఘాతానికి గురై ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ఇద్దరు స్కూలు విద్యార్థులను వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ పరామర్శించారు. నగరంలోని అనుశ్రీ థియేటర్ సమీపంలోని ట్రైనింగ్ కాలేజీ ప్రాంగణంలో ఉన్న ఒక పాఠశాలలో చదువుతున్న తొమ్మిదవ తరగతి విద్యార్థులు ప్రమాదానికి గురయ్యారు. స్కూల్ సమయంలో మామిడికాయలు కోయడానికి బయటకు వచ్చిన ఇద్దరు విద్యార్థులు, ఉపాధ్యాయులు మందలిస్తారన్న భయంతో గోడ దూకే ప్రయత్నంలో సమీపంలోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కు తగిలి షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో వారిని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. 15వ వార్డుకు చెందిన యన్. రమేష్ దానవాయిపేటలోని సురక్ష ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, 27వ వార్డుకు చెందిన ఉజ్వల ఈశ్వర సాయి దివాన్ చెరువు ప్రాంతంలోని కేశవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సమాచారం. విషయం తెలిసిన వెంటనే మార్గాని భరత్ ఆసుపత్రులకు చేరుకుని విద్యార్థులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా శాఖ అధికారులు వచ్చి ఒక్కో విద్యార్థికి రూ.10 వేల చొప్పున వైద్య ఖర్చుల కోసం ఇచ్చి వెళ్లిపోయారని, కానీ పిల్లలు తీవ్ర గాయాలతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పరిస్థితిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రతిపక్షం తెలుసుకుని వచ్చాకే ఈ విషయం బయటపడిందని అన్నారు. జిల్లా విద్యాశాఖాధికారితో మాట్లాడి విద్యార్థులకు ప్రభుత్వ తరపున పూర్తి వైద్య సహాయం అందించాలని డిమాండ్ చేసిన భరత్, లేకపోతే తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఇటీవలి రోజుల్లో కల్తీ పాలు ఘటన, వేట్లపాలెం బాంబు పేలుడు ఘటన, ఇప్పుడు ఈ విద్యార్థుల ప్రమాదం వంటి వరుస సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. బాధిత విద్యార్థులకు తక్షణమే ప్రభుత్వం అండగా నిలవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనను తెలియజేసిన వంగల మహాలక్ష్మి, దుర్గారావును భరత్ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో నగర బీసీ సెల్ అధ్యక్షుడు పీత రామకృష్ణ, 29వ వార్డు ఇన్‌చార్జి మునీశ్వరరావు, రేగుళ్ల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.